గత వారం రోజులుగా ప్రపంచమంతా వాలెంటైన్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. ప్రపంచ దేశలన్ని ప్రేమికుల దినోత్సవ సంబరాల్లో మునిగితేలాయి. భారత్‌లో కూడా ఈ సంబరాలు గట్టిగానే జరిగాయి. అయితే ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వాలెంటైన్స్‌ డేను వ్యతిరేకిస్తూ కొందమంది నిరసనలు దిగారు. గతంలో పోలిస్తే ఈ నిరసనలు కాస్త తగ్గినా అక్కడక్కడ అలాంటి సంఘటనలు కనిపించాయి. అయితే ఓ మహిళా కళాశాలలో  మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.


కాలేజీ విద్యార్థినులు వాలెంటైన్స్‌ డేకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ సారాంశం ఏంటంటే `నాకు మా అమ్మానాన్నల మీద పూర్తి నమ్మకం ఉంది. నా చుట్టూ జరిగే సంఘటనలకు నేను బయపడను. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ ప్రేమలో పడను. ప్రేమ వివాహం చేసుకోను. అలాగే, కట్నం అడిగే వారిని కూడా పెళ్లిచేసుకోను. ఒకవేళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా నా తల్లిదండ్రులు నాకు కట్నం ఇచ్చి పెళ్లిచేస్తే... భవిష్యత్తులో ఓ తల్లిగా నేను నా కూతురికి ఎలాంటి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తాను. ఏ మాత్రం కట్నం తీసుకోకుండా నా కోడలిని తెచ్చుకుంటాను. బలమైన, ఆరోగ్యవంతమైన భారత్ కోసం నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను`. అంటూ కళాశాల విద్యార్ధినులంతా ప్రతిజ్ఞ చేశారు.


అమరావతిలోని ఓ మహిళా కాలేజీలో విద్యార్థినులు ఇలా ప్రతిజ్ఞ చేశారు. అయితే, ఈ అమరావతి ఉంది ఆంధ్రప్రదేశ్‌లో కాదు, మహారాష్ట్రలో. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉన్న మహిళా వాణిజ్య మహావిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఆ కాలేజీ పరిపాలనా విభాగం ఈ వాలెంటైన్స్‌ డే సందర్భంగా విద్యార్థినుల చేత ఇలా ప్రతిజ్ఞ చేయించింది. నేషనల్ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేయించారు. అయితే, పిల్లలు ప్రేమ పేరుతో దారి తప్పకుండా చదువు మీద దృష్టి పెట్టి, అది పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించేలా చేయడానికే ఇలాంటి ప్రతిజ్ఞ చేయించినట్టు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే కాలేజీ యాజమాన్యం చేసిన ఈ పనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పిల్లల్లో స్వతంత్ర్య భావాలుపై ప్రభావం చూపించేలా, వాళ్ల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేలా కాలేజీ యాజమాన్యం ప్రవర్తిస్తుందని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: