మూడు రోజుల క్రితం జగన్ ఢిల్లీ వెళ్ళిన రోజు నుంచి కూడా, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎన్డియేలో చేరుతుంది అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిద్దాంత పరంగా రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని, దానికి తోడు రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసినప్పుడు, ఆరేళ్ళ నుంచి రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వడం లేదు కాబట్టి ఏ విధంగా వైసీపీ, ఎన్డియేలో చేరుతుంది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. 

 

దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. వామపక్షాలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసాయి. అటు రాజకీయ పరిశీలకులు కూడా బిజెపి తీరుని తప్పుబట్టారు. ఎన్డియేలో చేరిన పవన్ కళ్యాణ్, వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఒక పక్క విమర్శలు చేస్తుంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ కూటమిలో బిజెపి చేరుతుంది అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవదర్ క్లారిటీ ఇచ్చేసారు. గత రెండు రోజుల నుంచి జగన్ ఢిల్లీ వెళ్ళింది ఎన్డియేలో చేరడానికే అనే వ్యాఖ్యలను ఆయన తిప్పి కొట్టారు. 

 

వైసీపీతో తమకు ఏ విధమైన పొత్తు ఉండదని సునీల్ స్పష్టం చేసారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తాము రాజకీయంగా ప్రత్యర్దులమని ఆయన స్పష్టం చేసారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై తప్పకుండా పోరాటం చేస్తామని, జనసేన పార్టీతో కలిసి ముందుకి వెళ్తామని ఆయన తేల్చేసారు. ఏపీలో జనసేన పార్టీతో మాత్రమె పొత్తు ఉందని, ఆంధ్రప్రదేశ్ లో తాము ప్రతిపక్షంలో ఉన్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధమైన పొత్తుని వైసీపీతో పెట్టుకునే అవకాశమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: