28 వారాలు దాటిన తర్వాత పుట్టే పిల్లల్లో బతికే అవకాశాలు 99శాతం ఎక్కువ‌గా ఉంటాయి. 26 నుంచి 28 వారాల మధ్య పుట్టే పిల్లలు బతికే అవకాశాలు 70 శాతమే క‌నిపిస్తాయి. 24 వారాలు అంతకంటే ముందు పుట్టే పిల్లలు బతికే అవకాశాలు 30 శాతమే ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యల విషయానికొస్తే.. వారాలు తగ్గేకొద్దీ బతికే అవకాశాలు తగ్గుతూ ఉంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితోపాటు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు, పేగులులాంటి ప్రధాన అంతర్గత అవయవాలు సామర్థ్యాన్ని సమకూర్చుకోగలిగేది గర్భంలో ఉన్న చివరి మూడు నెలల్లోనే! ఈలోగానే ప్రసవమైతే పుట్టే పిల్లల్లో ఆ అవయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. 

 

అయితే పదేళ్ల ముందువరకూ 1.5 కిలోల బరువుండి ఐదో నెలలో పుట్టిన పిల్లలను బతికించగలమా? అంటే ఎక్కువశాతం మంది అసాధ్యమనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 24 వారాలకే పుట్టిన పిల్లల్ని కూడా మెరుగైన వైద్యంతో బతికించుకోగలుగుతున్నాం. 24 నుంచి 28 వారాల్లోపు పుట్టే పిల్లల్ని బతికించే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే ఇలాంటి పిల్లల్ని బతికించుకోవటానికి అత్యాధునిక చికిత్స అవసరమవుతుంది. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణ అవసరమవుతుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. 

 

గర్భసంచిలో సమస్యలు, సర్వైకల్‌ ఇంకాపిటెన్స్‌లాంటి గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నా, గర్భసంచి రెండుగా విడిపోయి ఉన్నా, గర్భంతో ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్లకు గురైనా, గర్భంతో ఉండగా మధుమేహం, హైపర్‌టెన్షన్‌, ఫిట్స్‌, కాలేయ సమస్యలు వచ్చినా, గర్భిణికి గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నా, మూత్రపిండాల మార్పిడి జరిగి ఉన్నా, మధుమేహంతో ఉండి గర్భం దాల్చినా, గర్భస్థ పిండానికి వ్యతిరేకమైన యాంటీబాడీస్‌ గర్భిణిలో తయారైనా, గర్భిణి, పిండం బ్లడ్‌ గ్రూప్‌లో తేడాలున్నా, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలతో గర్భం దాల్చినా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: