ఎన్డీఏ లో త్వరలోనే చేరబోతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్ననే హోంమంత్రి అమిత్ షాను కలిసిన జగన్ వివిధ అంశాలపై చర్చించిన సందర్భంగా కేంద్ర క్యాబినెట్లో చేరాల్సిందిగా జగన్ కు చెప్పడం, జగన్ చిరునవ్వుతో ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండటం తదితర పరిణామాలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీకి కేంద్ర క్యాబినెట్ లో మూడు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్ అమిత్ శాలు వివిధ అంశాలపై చర్చించుకుని ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.


 కేంద్ర క్యాబినెట్ లో చేరబోతున్న వైసీపీకి మూడు మంత్రి పదవులు రావడం పక్కా అని తేలడంతో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేదానిపై ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మిధున్ రెడ్డి, నందిగం సురేష్ పేర్లు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి, నందిగం సురేష్ లకు సహాయ మంత్రి పదవులు ఇచ్చే విధంగా బిజెపితో జగన్ చర్చించినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం. 


ఒకవేళ ఆ మూడు పేర్లలో ఒక పేరు మిస్ అయినా మహిళా కోటాలో మరొకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా బిజెపి వైసిపి తో సన్నిహితంగా మెలుగుతోంది. రాజ్యసభలో వైసీపీకి బలం పెరగనున్న నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు వైసిపి సహకరిస్తుందని బిజెపి ఆలోచిస్తోంది. అందుకే ఇప్పుడు జగన్ తో సన్నిహితంగా ఉంటూ ఏపీ అభివృద్ధి విషయంలో తాము సహకరిస్తామని బీజేపీ అగ్ర నేతలు సైతం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతుండడంతో వైసీపీలో ఆనందం ఎక్కువ అవుతోంది. 


ఏపీలో ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు అవసరంతోపాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు తదితర విషయాల్లో నిధులు సాధించాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి కావడంతో జగన్ ఇప్పుడు బీజేపీ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇక మొన్నటి వరకు వైసీపీకి రెండు మంత్రి పదవులు దక్కుతాయి అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రెండు కాదు మూడు మంత్రి పదవులు దక్కుతాయి అని తెలియడంతో వైసీపీ నాయకుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: