రెండు తెలుగు రాష్ట్రాలలో మొన్నటివరకు ఆకాశమే హద్దుగా ఉన్న చికెన్, మటన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. సాధారణంలో కిలో 200 రూపాయల వరకు పలికే చికెన్ ధరలు ప్రస్తుతం దాదాపు 80 రూపాయలు తగ్గి కిలో 120 రూపాయల వరకు పలుకుతోంది. సోషల్ మీడియాలో మాంసాహారం వలనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని ప్రచారం జరుగుతూ ఉండటంతో చికెన్, మటన్ ప్రియులు మాంసాహారం తినటానికి వెనుకంజ వేస్తున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ ఉండటం మరియు కరోనా వైరస్ ప్రభావం చికెన్ వినియోగాన్ని బాగా తగ్గించేసింది. ఫారం కోడి రేటు కిలో 100 రూపాయల నుండి 60 రూపాయలకు పడిపోయింది. రిటైల్ గా కిలో చికెన్ 120 రూపాయలకు అమ్ముతున్నా కొనుగోళ్లు లేక చికెన్ షాపులకు కళ తగ్గిపోయింది. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం హోటళ్లపై కూడా తీవ్ర స్థాయిలో పడింది. 
 
నాన్ వెజ్ అమ్మకాలు హోటళ్లలో కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్లలో కూడా నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్లు భారీగా తగ్గుతున్నట్టు తెలుస్తోంది. చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 100 కోడిగుడ్ల ధర 420 రూపాయల నుండి 380 రూపాయలకు తగ్గింది. చికెన్, మటన్, గుడ్డు ధరలు తగ్గుతూ ఉండటంతో వ్యాపారులకు భారీగా నష్టాలు వస్తున్నాయి. 
 
కరోనా వైరస్ చికెన్, మటన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ అబద్ధపు ప్రచారం మాత్రం ఆగటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చికెన్, గుడ్ల వినియోగంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మాత్రం నమ్మటం లేదు.మన దేశంలో ఆహార పదార్థాలను 100 సెంటిగ్రేడ్ దగ్గర ఉడికించుకుని తింటున్నామని అందువలన ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: