ఏపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ, వైసీపీ దగ్గరవుతున్న  సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ హర్టయ్యారు. బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే అభ్యంతరం లేదంటూనే.. అప్పుడు తాను ఉండనని తేల్చిచెప్పేశారు. 

 

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల్లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని గతంలోనే ప్రకటించారు పవన్. అంతకుముందు హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అని ప్రశ్నించినా.. ఇప్పుడు అమరావతి కోసం రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పొత్తుకు వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు రాష్ట్ర స్థాయి నేతలతో కాకుండా జాతీయ స్థాయి నేతలతో హామీ ఇప్పించాలని కూడా జనసేనాని అనుకున్నారు. 

 

ఎన్నో ఆశలతో ఢిల్లీ వెళ్లిన పవన్ కు.. అక్కడ పరిణామాలు పెద్దగా మింగుడు పడలేదు. అమరావతి విషయంలో కేంద్రాన్ని లాగొద్దని జాతీయ నేతలు స్పష్టంగా చెప్పడంతో.. పవన్ ఇప్పుడు అమరావతి రాగానే.. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమేనని అన్ని సభల్లో చెప్పారు. కానీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఓ మాట, గల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని మనసులో మాట బయటపెట్టారు. ఇదే తనకు బాధ కలిగిస్తోందని కూడా అన్నారు. ఇప్పటికే అమరావతి రైతుల్లో ఇదే అభిప్రాయం ఉండటంతో.. పవన్ కామెంట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

బీజేపీ వ్యవహారశైలిపై పవన్ కు చాలా సందేహాలున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ టూర్లో నేతలు మాట్లాడిన తీరుపై అసంతృప్తిగా ఉన్న పవన్ కు.. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత మరింత క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ దొరకగానే.. వైసీపీ క్యాబినెట్ లో చేరుతుందన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో.. జనసేనాని హర్టయ్యారు. ఓవైపు తనతో స్నేహం చేస్తూ.. మరోవైపు వైసీపీని దువ్వడమేంటని ఆయన ఆవేదన చెందుతున్నారు. గతంలో టీడీపీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని చంద్రబాబు చెప్పిన మాటల్ని జనసేనాని గుర్తుచేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: