ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో కేంద్రం నుంచి సరైన స్పష్టత కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారో లేదో తెలియదు గాని అమరావతి ప్రాంత రైతులతో పాటుగా రాజకీయ పక్షాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేంద్రం మద్దతు ఇస్తే మాత్రం ఒక్కసారిగా రాష్ట్రంలో ఆందోళనలు కూడా మిన్నంటే అవకాశం ఉంటుంది. రాజకీయంగా బిజెపి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రంలో జనసేన రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపుగా అంతం అయినట్టే అనేది కూడా వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు వైసీపీ నేతలు కొన్ని ప్రకటనలు చేసారు. "ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని అధికార వైసీపీ ప్రకటించింది. ఆయన పర్యటన సక్సెస్ అయిందని జగన్ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపిందని వైసీపీ వ్యాఖ్యానించింది.  మూడు రాజధానులు, మండలి రద్దు కి కేంద్రం హామీ ఇచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దు బిల్లు, పార్లమెంట్ రెండో సెషన్ లో ప్రవేశ పెట్టే అంశంపై పరిశీలనకు అంగీకారం తెలిపినట్టు వైసీపీ నేతలు ప్రకటించారు." అంటూ వైసీపీ నేతలు తాజాగా ప్రకటించారు. 

 

ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం పవన్ అన్నట్టు బిజేపినే కాదు కేంద్రం కూడా డబుల్ గేమ్ ఆడినట్టే. వాస్తవానికి గల్లా జయదేవ్ లోక్సభలో ఒక ప్రశ్న వేసినప్పుడు... రాష్ట్ర రాజధాని అంశం మా పరిదిలోనిది కాదూ అని చెప్పింది. పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అలాంటప్పుడు జగన్ కి ఏ విధంగా కేంద్రం హామీ ఇచ్చింది...? దీనికి వైసీపీ నేతలు అబద్దం అయినా చెప్పి ఉండాలి. లేదా కేంద్రం అయినా డబుల్ గేమ్ ఆడుతూ ఉండాలి. కేంద్రం చెప్పకుండా అంత సిల్లీగా వైసీపీ చెప్తుందా...? రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే అంశమైన మూడు రాజదానులకు మద్దతు ఇచ్చి అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ చిచ్చు రగల్చడానికి విపక్షాలకు బిజెపి అవకాశం ఇచ్చుకుంటుందా...? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: