ఓవైపు బ‌డ్జెట్ విష‌యంలో వివిధ వ‌ర్గాల పెద‌వి విరుపులు...మ‌రోవైపు అస్ప‌ష్ట‌మైన ఐటీ శ్లాబుల అయోమ‌యం నేప‌థ్యంలో....కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండు రోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. కేవ‌లం ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా...బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు.  ఈ నెల 16, 17 తేదీలలో కేంద్ర‌మంత్రి జ‌రిపే ఈ టూర్‌పై అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది.

 

బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా,  రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక, రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ గురించి సందేహాల నివృత్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. నిర్మలా సీతారామన్ పర్యటన వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

 

ఇదిలాఉండ‌గా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. కోల్‌కతాలో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో నిర్వ‌హించిన‌ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ఎంఎస్‌ఎంఈ లకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.  ఫిర్యాదుల స్వీకరణకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్ని  వారికి నిర్మలా సీతారామన్ వివరించారు. బ‌డ్జెట్‌లో సందేహాల నివృత్తికి తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు.

 

ఇదిలాఉండ‌గా, దేశ‌ ఆర్థిక వ్యవస్థ ఐసీయూను దాటిపోతున్నదని, అయినప్పటికీ మోదీ సర్కారు అసమర్థ వైద్యులతోనే చికిత్స చేయిస్తున్నదని పరోక్షంగా నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు న‌గ‌రాల ప‌ర్య‌ట‌న‌లో  దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్ట‌త ఇస్తార‌ని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: