బీజేపీ , జనసేనల మధ్య మైత్రికి నూకలు చెల్లినట్లేనా ?, పవన్ ఆట లో అరటి పండు  అయ్యారా ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . ఢిల్లీలో  బీజేపీ పెద్దల సమక్షం లో ఆ పార్టీతో  మైత్రి ఓకే  చెప్పిన పవన్ , రాష్ట్ర కమలనాథులతో కలిసి ముందుకు నడవాలని నిర్ణయించుకున్నారు . ఈ మేరకు రాష్ట్రంలో  బీజేపీతో  కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలను చేపట్టాలని భావించారు .

 

 ఇదే విషయాన్ని జనసేనాని పవన్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు సంయుక్తంగా ప్రకటించారు .   స్థానిక సంస్థల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తరువాత ,ఈ నెల  రెండవ తేదీన రాజధాని రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని భావించారు  .  అయితే అంతలోనే ఏమి జరిగిందో ఏమో కానీ లాంగ్ మార్చ్ కార్యక్రమం రద్దయింది . దీనితో  పవన్ బాగా అసంతృప్తి కి గురయినట్లు తెలుస్తోంది .

 

  బీజేపీ ప్రమేయం లేకుండానే ,  ఒంటరిగానే  ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్  ఆసక్తి  చూపించడం చర్చనీయాంశంగా మారింది  . నిన్న కర్నూల్  , నేడు రాజధాని ప్రాంతం లో పవన్ నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేపీ ఊసన్నదే  లేకుండా పోయింది .  దానికితోడు ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా అసలు బీజేపీ , జనసేన మధ్య మైత్రి  కొనసాగుతోందా? లేదా ?? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది .

 

ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం , వైస్సార్ కాంగ్రెస్ పార్టీని  మోదీ, కేంద్ర కేబినెట్ లోకి  ఆహ్వానించారన్న ఊహాగానాల నేపధ్యం లో బీజేపీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ల  మధ్య కొత్తగా  రాజకీయ స్నేహం చిగురించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .  ఈ నేపధ్యం లో పవన్ తో బీజేపీ పొత్తు కొనసాగిస్తుందా ? లేదా ?? అన్న అనుమానాలు నెలకొన్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: