ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్ లో చేరడం దాదాపు ఖాయమైనట్లుగానే హస్తిన వర్గాలు చెబుతున్నాయి . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు సుముఖత తెలియజేశారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .  కేంద్ర మంత్రివర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు , దానిలో 
ఒకటి కేబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి కాగా , మరొకటి సహాయ మంత్రి పదవిగా  హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి .

 

అయితే కేంద్ర కేబినెట్ లోకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ని కాకుండా మిథున్ రెడ్డి తోపాటు మరో మహిళ ఎంపీకి అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది . విజయ సాయి పేరు ప్రతిపాదిస్తే , బీజేపీ పెద్దలు తిరస్కరించే అవకాశముందని భావిస్తోన్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు బదులుగా లోక్ సభ పార్టీ నేత మిథున్ రెడ్డి కి అవకాశం కల్పించాలని నిర్ణయించారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . మిథున్ రెడ్డి తో పాటు కాపు సామాజిక  వర్గానికి చెందిన మహిళ  ఎంపీ కి,  లేదంటే దళిత సామాజిక  వర్గానికి చెందిన మహిళ ఎంపీ పేరును జగన్ ప్రతిపాదించే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది .

 

కాపు సామాజిక  వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వంగా గీత , దళిత సామాజిక వర్గం నుంచి అమలాపురం ఎంపీ చింతా  అనురాధ పేర్లను పరిశీలించే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . వీరిద్దరి పేర్లనే కాకుండా సామాజిక సమీకరణాల నేపధ్యం లో మరికొందరి పేర్లను కూడా జగన్ పరిశీలించవచ్చుననే ప్రచారం జరుగుతోంది . అయితే ఇంతకు  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర కేబినెట్ లో చేరే అంశంపై అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే  మంత్రివర్గం లోకి ఎవరి పేర్లను జగన్ ప్రతిపాదిస్తారన్న ప్రశ్న తలెత్తుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: