ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముసలివారయ్యారని తరుచూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తుండడంతో వయస్సురీత్యా ఆయనకు ముసలితనం వచ్చినా  చంద్రబాబు ఇంకా యువకుడేనని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు . అనడమే కాదు ... అధికార పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నారు . ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ మంత్రులు ఎవరైనా చంద్రబాబు కంటే  ముందుగా కాలినడకన తిరుమల కొండ ఎక్కగలరా ? అంటూ ప్రశ్నిస్తున్నారు .

 

చంద్రబాబును ముసలివాడంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల విలేకర్ల సమావేశం లో అపహాస్యం చేయడం పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా నొచ్చుకున్నంటున్నారు . అందుకే చంద్రబాబు తో నడక పోటీకి సిద్ధమా ? అంటూ బొత్సను ప్రశ్నించారు అచ్చెన్న . ఒకవేళ పోటీకి సిద్ధం కాకపోతే, తానే ముసలివాడ్ని అని విలేకర్ల సమావేశం లో ఒప్పుకోవాలంటూ షరతు విధించారు . ఇక ఒక మంత్రికి మాత్రమే సవాల్ చేస్తే ఏమి బాగుంటుందని అనుకున్నారేమో అచ్చెన్నాయుడు , కేబినెట్ మొత్తం బాబుతో పోటీ పడాలని సవాల్ చేశారు .

 

దానికి తిరుమల కొండను వేదిక చేశారు . పుణ్యం , పురుషార్థం కలిసి వస్తుందని భావించారో ఏమో కానీ , ఎవరైతే తిరుమల కొండ కాలినడకన ముందు ఎక్కుతారో వాళ్లే కుర్రాళ్ళు , మిగతావాళ్ళు ముసలివాళ్ళు అంటూ  ముక్తాయింపునిచ్చారు అచ్చెన్న . చూడాలి మరి ఏపీ కేబినెట్ మంత్రులు ఎవరైనా ఈ సవాల్ స్వీకరిస్తారో ...  లేదో ?. 

 


చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయం లో కఠిన నియమాలు పాటిస్తారనే విషయం జగమెరిగిన సత్యమే . ఆయన వయస్సు వాళ్ళు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బహు అరుదుగానే కొనసాగుతున్నారు . బాబు మాత్రం ఇంకా తన వయస్సు లో సగం కూడా లేని జగన్మోహన్ రెడ్డి తో పోటీపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: