రాజకీయాల్లో తనది నలభై ఏళ్ల అనుభవమని చంద్రబాబు ఊదరగొడుతూంటారు. కానీ.. రాజకీయ జీవితంలో బాబు చేసిన మూడు ఘోరమైన పొరపాట్లకు ఆయన, పార్టీ నష్టపోవటమే కాదు.. అనేక మార్పులకు కారణమయ్యాయి. 1999 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాక కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఓ చారిత్రక నిర్ణయానికి నాంది పలికింది. కేసీఆర్ సొంత పార్టీ పెట్టుకునేలా చేసంది. అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారిపోయింది.

 

 

2003లో అలిపిరి బ్లాస్ట్ వల్ల సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయారు బాబు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బ తినడమే కాదు ఏకంగా పదేళ్లు అధికారానికి దూరమైంది. వైఎస్ పాదయాత్ర దెబ్బకే కాకుండా.. భీకరమైన ఆయన ఛరిష్మా ముందు టీడీపీ అడ్రస్ గల్లంతయిపోయింది. దీంతో టీడీపీ 2009లో కూడా గెలవలేకపోయింది. అదే ఏడాది వైఎస్ దుర్మరణం.. జగన్ సీఎం కాకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం.. తర్వాత ఆయన్ను జైలుకు పంపించడం మరో చరిత్రకు నాంది పలికింది. ఇందులో చంద్రబాబుకూ భాగముందంటారు. ఇదే జగన్ సొంతపార్టీ పెట్టుకునేట్టు చేసింది. 2014లో బాబు ఏపీకి సీఎం అయ్యాక జగన్ ను అడుగడుగునా అవమానించారు. ఇది గమనించిన ప్రజలు 2019లో జగన్ ను తిరుగులేని ఆధిపత్యంతో గెలిపించి ఏపీ సీఎంగా కూర్చోబెట్టారు. ఇందుకూ చంద్రబాబే కారణమయ్యారు.

 

 

ఇలా జగన్ సీఎం అవటానికి.. టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి బాబు తీసుకున్న నిర్ణయాలే కారణమన్నది టీడీపీ నాయకులు కూడా కొట్టిపారేయలేరు. తెలంగాణ ఆవిర్భావానికి, పదేళ్లు ప్రతిపక్షానికి, ప్రస్తుత టీడీపీ పరిస్థితికి చంద్రబాబు పరోక్ష కారకులయ్యారు. బీజేపీ, పవన్ తో తగువు కూడా చంద్రబాబు చేసిన తప్పిదాలే అని చెప్పాలి. వీటికి తాను పరోక్ష కారకుడినవుతానని బాబు కూడా ఊహించి ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: