టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు ఆయ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారుకు అండ‌గా నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే...మ‌రోవైపు అదే ప్ర‌భుత్వం నుంచి త‌ల‌సాని ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోసం టీఆర్ఎస్ పార్టీ నేత‌గా, రాష్ట్ర మంత్రిగా చేసిన ప‌నికి ఆయ‌న ఫైన్ క‌ట్టాల్సి వ‌చ్చింది. 

 

వివ‌రాల్లోకి వెళితే... తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం ఈనెల 17. కేసీఆర్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో త‌ల‌సాని కటౌట్‌ ఏర్పాటు చేశారు. అయితే, అనుమతి లేకుండా అక్రమంగా భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారని, ఏమైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొంటూ విశాల్‌ అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు.. మంత్రి తలసానికి రూ.5000 జరిమానా విధించారు. ఓ సామాన్యుడి ఫిర్యాదుకు తక్షణమే స్పందించిన జీహెచ్‌ఎంసీ... రూ.5000 జరిమానా విధించడంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని ర‌కాలైన నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నల విష‌యంలో ఇదే విధంగా న‌డుచుకోవాల‌ని కోరుకుంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా, ఎంజీబీఎస్‌ నుంచి జూబ్లీ మార్గం మెట్రోరైలు ప్రారంభోత్సవం విష‌యంలో నెల‌కొన్న వివాదంపై త‌ల‌సాని స్పందించారు. బీజేపీ నేత‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మంత్రి త‌ల‌సాని స్పందిస్తూ  తానే స్వయంగా కిష‌న్‌రెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానించానని తెలిపారు. ప్రొటోకాల్‌ పాటించామని, అధికారులు కూడా కేంద్ర మంత్రిని ఆహ్వానించారని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం అనవసర ఆరోపణలు చేయొద్దని హితవుపలికారు.  శిలాఫలకంపై సీఎం కేసీఆర్‌ తరువాత కిషన్‌రెడ్డి పేరు పెట్టామన్నారు. ఈ నెల 7 తర్వాత కిషన్‌రెడ్డి 25 రోజులపాటు విదేశీ పర్యటనలో ఉంటారని తెలిసి.. 7న ప్రారంభాన్ని ఖరారు చేశారన్నారు. మెట్రో మొదటి కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చారని, ఇది తమ పార్టీ కార్యక్రమం కాదని, అయితే ప్రధానమంత్రి ఫొటోలు లేవనడంలో వాస్తవంలేదని తలసాని స్పష్టంచేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: