ప్ర‌ధాన‌మంత్రి, బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర‌ మోదీ ఇలాకాలోనే సుప్రీంకోర్టు జ‌స్టిస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న నేప‌థ్యంలో...సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ కీల‌క కామెంట్లు చేశారు.  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘జస్టిస్‌ పీడీ దేశాయ్‌ స్మారక 15వ ఉపన్యాస’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న  అసమ్మతి దేశద్రోహం కాదని, అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం వంటిదని పేర్కొన్నారు. అసమ్మతి వాదులపై జాతి వ్యతిరేకులుగా ముద్రవేయడం రాజ్యాంగ విలువలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడంతో సమానమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

 


‘ద హ్యూస్‌ దట్‌ మేక్‌ ఇండియా: ఫ్రం ప్లూరాలిటీ టు ప్లూరలిజం’ అనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే గొంతుకలను బలవంతంగా మూయించడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తుందన్నారు. `ప్రశ్నించేతత్వాన్ని, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భయాన్ని సృష్టించడం, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అసమ్మతివాదులపై ఏకపక్షంగా దేశద్రోహులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్రవేయడం అనేది రాజ్యాంగ విలువలను కాపాడుతామన్న మన నిబద్ధతపై దాడిచేయమే. ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించినట్టే.` అని స్ప‌ష్టం చేశారు. 

 

 

సమాజం నుంచి వచ్చే భిన్న స్వరాలను గుర్తించడం, వాటికి విలువ ఇవ్వడం, స్పందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గుర్తించవచ్చున‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. ``ప్రజాస్వామ్య వ్యవస్థకు చర్చలు, భిన్న వాదనలే ప్రాణం. దేశంలోని ప్రతి వ్యక్తి తన వాదనను స్వేచ్ఛగా, బలంగా వినిపించే వాతావరణాన్ని కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలు మాత్రమే నిర్వచించలేవు.ఆదర్శవంతమైన సమాజం మైనార్టీ వర్గాల అభిప్రాయానికి విలువ ఇస్తుంది. ఆ సమాజం నుంచి వెలువడే ప్రతి నిర్ణయం ఏకాభిప్రాయంగా ఉంటుంది. భిన్న వాదనలకు రాజ్యాంగబద్ధత ఉన్నది. దీనికి పరిరక్షించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి. ఇతరుల మనోభావాలను, అభిప్రాయాలను మనం గౌరవించాలి.`` అని పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఏఏ నిరసనల్లో ఆస్తుల విధ్వంసానికి సంబంధించి యూపీ సర్కారు ఆందోళనకారుల నుంచి సొమ్ము రికవరీ చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న ధర్మాసనంలో చంద్రచూడ్‌ భాగస్వామి కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: