నిజానికి రాష్ట్ర స్థాయిలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటం కనిపిస్తున్నా… లోలోపల ఆ పార్టీల నడుమ కేంద్ర స్థాయిలో అంత ఘోరంగా సంబంధాలు ఏమీ చెడిపోలేదు. తన కూతురు కవితను రాజ్యసభకు పంపించి, వీలయితే కేంద్ర మంత్రిని చేయాలనే అభిలాష కేసీయార్‌ లోనూ ఉందని అంటుంటారు. ఈ నేపథ్యంలో కేసీయార్, మోడీ భేటీపై ఆసక్తి నెలకొంది. 'నోట్ల రద్దు వంటి విషయాల్లో మోడీకి సపోర్ట్ చేసి తప్పు చేశాం.. పశ్చాత్తాపపడ్డాం' అని కేటీఆర్ అంటున్నాడు. బీజేపీ వ్యతిరేక ప్రకటనలే చేస్తున్నాడు. కానీ ఈ ధోరణి ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఉండదు కూడా. కేసీఆర్- మోడీ భేటీ రాష్ట్ర రాజకీయాల దశను ఏమైనా మార్చే చాన్సుందా..?! ఉంది. ఉంటుంది.

 


అమరావతి రాజధాని తరలింపు అన్యాయం, మూడు రాజధానులు ఓ దుర్మార్గం' అని ఏపీ బీజేపీ నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది. తమకు భూములున్నాయని కాదు గానీ.., సుజనా చౌదరి, కన్నా లక్ష్మినారాయణ, కొత్త కాషాయ కార్యకర్త పవన్ కల్యాణ్ ఎడాపెడా జగన్‌ను ఆడిపోసుకుంటూ సహజంగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ మాత్రం జగన్‌ను 'ఎన్డీయేలోకి రా, రా' అని పిలుస్తూ ఉంటుంది… సేమ్… కేసీయార్‌. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతూ ఉంటుంది. కానీ జగన్‌ను పిలిచినట్టే కేసీయార్‌ ను కూడా రారమ్మని బీజేపీ హైకమాండ్ పిలుస్తున్నది. 

 

ఒవైసీ ఎజెండాతో బీజేపీ మీద జాతీయ స్థాయి పోరాటం చేస్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్న కేసీయార్ దానికి సై అంటాడా..? తిరస్కరిస్తాడా..? ఓకే అనే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కేసీఆర్ 'ఐక్యూ లెవల్' చాలా ఎక్కువ. మొన్న ప్రధాని మోడీతో జగన్ భేటీలో మోడీ ఓ మాట చెప్పాడు.  జగనే కొందరు తన పార్టీ ముఖ్యులతో షేర్ చేసుకున్న సమాచారమే..! 2023లో కాదు, 2022లోనే జమిలి ఎన్నికలు ఉంటాయి అని..! ఆ దిశలో అడుగులు అంత ఈజీ టాస్క్ కాదు. కానీ బీజేపీ అటు వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తేనే తనకు రాష్ట్రాలు, కేంద్రంలో మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నది. అది జరగాలంటే తనకు బలమైన ప్రాంతీయ పార్టీల సపోర్ట్ కావాలి. కాంగ్రెస్‌ ను, మమత వంటి 'హార్డ్ కోర్' మోడీ వ్యతిరేకులను తొక్కేయాలి.

 

సో, దక్షిణాదిన తనకు అవసరం స్టాలిన్, జగన్, కేసీయార్. అసలే ఈ ముగ్గురూ కలిసి మొన్నటి ఎన్నికల ముందు తనకు వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఇక వారిని కలిపేసుకోవాలి. తను అనుకున్న దిశలో అడుగులు వేయాలి. జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంటే బీజేపీ బెటర్ పర్‌ ఫారమ్ చేస్తుంది. అది కేసీయార్‌ కూ తెలుసు, అందుకే మొన్న లోకసభ ఎన్నికలకు ముందే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు 'లాజిక్'గా వెళ్లాడు. లోకసభ ఎన్నికలొచ్చేసరికి తాను అనుకున్న సీట్లలో ఏడు తగ్గిపోయాయి… మరి ఇప్పుడు 'జమిలి ఎన్నికలు' అనే బీజేపీ ఆలోచనకు 'తనెలా స్పందిస్తాడు' అనేది వేచి చూడాలి మరి. రాజకీయాలంటే ఎప్పుడూ శతృత్వమూ ఉండదు, మిత్రత్వమూ ఉండదు. అవసరాల మేరకే సర్దుబాట్లు ఉంటాయ్ మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: