చైనాలో కరోనా భయం రోజురోజుకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య వేలకు చేరుతుండటంతో చైనీయులు కరోనా భయంతో అల్లాడుతున్నారు. కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న వుహాన్‌లోని ఆస్పత్రుల్లో రోగులకు కావాల్సినవి అందించడానికి రోబోలను రంగంలో దించారు.

 

చైనాకు సాయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ప్రపంచ దేశాల వైద్యులు చైనాకు చేరుకున్నారు. ఇప్పటివరకు 1523 మంది రోగులు ఈ వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. చికిత్స చేస్తున్నవారిలో 1700 మంది ఆరోగ్య సిబ్బందికీ వైరస్‌ సోకింది. చైనాలో కరోనాను అరికట్టేందుకు...అన్ని ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైగా వైద్యుల్ని హుబెయ్‌ ప్రావిన్సుకు పంపించారు.

 

 

కరోనా ప్రభావం చైనా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. చివరకు ప్రశాంతంగా ప్రార్థనలు కూడా చేసుకోలేక పోతున్నారు. రెండు వారాల పాటు బహిరంగ ప్రార్థనల్ని రద్దు చేస్తున్నట్లు పలు చోట్ల ప్రకటించారు. ఇంట్లోనే ఉండి.. ఆన్‌లైన్‌లో ప్రార్థనల్ని వీక్షించాలని కోరుతున్నారు. చైనాలోనే కాదు.. కరోనా ప్రభావం ఉన్న ఇతర దేశాలూ ఈ జబ్బు భయంతో గడగడా వణికిపోతున్నాయి.

 

 

ప్రార్థనా మందిరాలకు వచ్చిన వారు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఫిలిప్ఫీన్స్‌లోని ఓ చర్చి ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ వైరస్‌ ముఖ భాగాల నుంచి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చేతులతో ముఖాన్ని తాకవద్దని సింగపూర్‌ మంత్రి లారెన్స్‌ వాంగ్‌ సూచించారు. హంకాంగ్‌, సింగపూర్‌లలో.. టాయిలెట్‌ పేపర్లు, కాగితంతో తయారు చేసిన రుమాళ్లు, మాస్కులు, చేతుల్ని శుభ్రం చేసుకునే ద్రావణాలకు కొరత తలెత్తింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: