ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల జరిగిన ఐటి దాడులు ఏ రేంజ్ లో సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిన విషయమే. రాజకీయంగా ఈ ఐటి దాడులు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా అధికార విపక్షాల మధ్య మాటల దాడికి కూడా వేదికగా మారాయి. దీనితో ఏదో జరుగుతుంది, లేదా జరగబోతుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. అటు ప్రభుత్వ అనుకూల మీడియా ఇటు విపక్ష అనుకూల మీడియాలో ఎన్నో వార్తలను వండి వార్చారు.

 

దీనిని చూసి సోషల్ మీడియా రాజకీయ పరిశీలకులు కూడా సందడి చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు వద్ద పని చేసిన ఒక మాజీ ఉద్యోగి వద్ద ఆస్తులు దొరికాయి అంటూ ఒక వర్గం మీడియా ప్రచురించిన కథనాలు విపక్షాన్ని ఇబ్బంది పెట్టాయి. ఐటి పేర్లు చెప్పకుండా కేవలం లెక్క మాత్రమే చెప్పింది. దీనితో ఆ మొత్తం చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ దగ్గరే దొరికాయి అంటూ కథనాలు రాసి చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అన్నారు. ఈ తరుణంలో ఐటి శాఖ షాక్ ఇచ్చింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు తన పంచానామాలో పేర్కొంది. 

 

ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది ఐటి శాఖ. రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటి శాఖ తన నివేదికతో స్పష్టం చేసింది. ఐటి శాఖ విడుదల చేసిన పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వర్గాలు చల్లబడ్డాయి. కేవలం అది ప్రచారమే అని ముందు నుంచి అంటున్న వారు నవ్వడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: