బంగారం కోసం గనుల్లో అన్వేషిస్తారు. ప్రపంచంలో దీనికి ఉన్న గిరాకీయే వేరు. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు బంగారం కోసం అనేక రీతుల్లో అన్వేషణ జరుగుతూ వస్తోంది. అయితే బంగారాన్ని కొత్త పద్ధతిలో తీస్తామంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. 

 

దేశ వ్యాప్తంగా నాణ్యమైన బంగారు అభరాణాల తయారీకి పెట్టింది పేరు నెల్లూరు. ఇక్కడ అన్ని రకాల అభరణాలను తయారు చేస్తుంటారు. ముక్క పుడక నుంచి ఒడ్డాణం వరకు ఇక్కడ తయారవుతుటాయి. ప్రతి రోజు టన్నుల కొద్దీ బంగారం ఆభరణాలుగా తయారవుతాయంటే అశ్ఛర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు బంగారు అభరణాలు తయారు చేస్తుంటారు.

 

అయితే... ప్రతీ రోజు ఆభరణాలు తయారు చేస్తున్న సందర్భంగా కొంత బంగారం వృథా అవుతుంటుంది. అదీ గ్రాములో మీల్లీ వంతు కంటే తక్కువగానే ఉంటుంది. తయారీ సందర్భంగా కొంత బూడిదలో కలుస్తుంది. తయారీదారులు శుభ్రం చేసినప్పుడు అది కాస్తా మురికి కాల్వల్లోకి వెళుతుంటుంది. ఇలా మురికి కాల్వలో దుమ్ములో చిక్కుకు పోయిన బంగారాన్ని కొంతమంది అన్వేషిస్తుంటారు. మురుగు కాలువలోకి దిగి బంగారం రేణువులను ఒడిసి పట్టుకుంటారు. నిజానికి కొందరు పేదలకు మురుగులో బంగారం అన్వేషణే జీవనాధారంగా మారింది. తాతలు, ముత్తాతల కాలం నుంచి ఈ ప్రాంతంలో బంగారం కోసం ప్రతి రోజు అన్వేషిస్తూనే ఉంటారు. సాయంత్రానికి వారికి దొరికే మిల్లీ గ్రాముల బంగారాన్ని దుకాణంలో ఇచ్చి వచ్చినంత తీసుకుంటారు. ఆ పూటకు చాలీచాలనీ భోజనంతోనే గడిపేస్తుంటారు. నరసింహకొండ సమీపంలోని కొన్ని గ్రామాలు, మైపాడు రూట్‌లోని కొన్ని గ్రామాల్లోని పేదలు తరాల నుంచి ఈ పని చేసుకుంటున్నారు. 

 

ఇక...బంగారం పనులు చేసే దుకాణాల్లో చిన్నపాటి బంగారం రేణువులు గాలికి ఎగురుతుంటాయి. వాటిని పని చేసేవారు కాళ్లతో తొక్కుతుంటారు. అవి కాస్తా రోడ్లపైకి వస్తుంటాయి. ఆ రేణువులు మట్టిలో కలిసి మురుగు కాలువల్లోకి వెళ్తుంటాయి. ఆ చిన్నపాటి బంగారు రేణువుల కోసమే ఈ పేదలు వేట ప్రారంభిస్తారు. బంగారు దుకాణాలు ఉన్న ప్రాంతాల్లోని రోడ్లను శుభ్రంగా చిమ్ముతారు.  ఆ మట్టిని గోతాలు కట్టుకుని అందులో ఉన్న బంగారం కోసం రోజంతా వెతుకులాడుతారు. కొంతమంది దుకాణాల వద్ద మురుగు కాలువల్లోని బురదను జల్లెడ పడతారు. ఇలా రోజంతా కష్టపడితే వీరికి 200 నుంచి 400 వరకు సంపాదన ఉంటుంది. ఆ రోజు అన్వేషించిన బంగారాన్ని దుకాణాల్లో అమ్మేస్తారు. 

 

తరతరాలుగా ఈ పనికి అలవాటు పడిన వీరు తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల చదువులు వీరిని ఎటూ కాకుండా మారుస్తున్నాయని అంటున్నారు. రోజుకు ఎంత ఆదాయం వస్తుందో తెలియదని...అయినప్పటికీ ఇదే పనిచేస్తున్నామని అంటున్నారు. మురుగులో పని చేయడం వల్ల అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి...మురుగు నీటిలో బంగారం అన్వేషించే కార్మికులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: