మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాన్ ఓ నిజాన్ని అంగీకరించారు. ఇంతకీ అదేమిటంటే తన పార్టీలో ఎంఎల్ఏ ఉన్నాడో లేదో కూడా తనకు తెలీదని ఒప్పేసుకున్నాడు.  తనకు అధికారం లేదని ఉన్న ఒక ఎంఎల్ఏ తన పార్టీలో ఉన్నాడో లేదో కూడా తెలీదంటూ చెప్పటం సంచలనంగా మారింది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ అన్న విషయం అందిరికీ తెలిసిందే.  తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో గెలిచిన రాపాక పార్టీ పరంగా కాకుండా  సొంత పట్టువల్లే గెలిచారు.

 

ఎన్నికల్లో ఎదురైన ఘోర అనుభవానికి తోడు తన మాస్టర్ చంద్రబాబునాయుడుకు కూడా మాడు పగిలిపోవటంతో జగన్మోహన్ రెడ్డిపై పవన్ బాగా కసి పెంచుకున్నారు. సంబంధం లేని అంశాలను కూడా జగన్ కు ముడేసి  నోటికొచ్చినట్లు ఆరోపణలతో రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. తాను జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లే తన పార్టీ ఎంఎల్ఏ రాపాక కూడా వ్యతిరేకించాలని ఆదేశించాడు. అయితే గుడ్డిగా తాను జగన్ వ్యతిరేకించనని చెప్పేశాడు. పైగా అంశాల వారీగా జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నాడు. దాన్ని పవన్ సహించలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది.

 

జగన్ ప్రవేశపెడదామని అనుకున్న ఇంగ్లీషు మీడియంను చంద్రబాబు ఏ స్ధాయిలో వ్యతిరేకించాడో అందరూ చూసిందే.  అందుకనే పవన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే ఎంఎల్ఏ రాపాక మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చాడు.  ఇక మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కూడా తన మాస్టర్ చెప్పినట్లే పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అయితే రాపాక మాత్రం జగన్ నిర్ణయం భేష్ అంటూ మద్దతుగా మాట్లాడాడు.

 

ఇక్కడ సమస్యేమిటంటే రాపాకను పవన్ అదుపు చేయలేకపోతున్నాడు. అలాగని పూర్తిగా వదిలేయలేకపోతున్నాడు. యాక్షన్ తీసుకుందామంటే రాపాకేమో దళిత ఎంఎల్ఏ అయిపోయాడు. జనాలకు మంచి చేద్దామని జగన్ చేస్తున్న ప్రయత్నాలను తాను సమర్ధిస్తుంటే ఓర్వలేకపోతున్నాడంటూ రాపాక రోడ్డు పైకి ఎక్కితే పవన్ ఏమీ మాట్లాడలేడు. పైగా దళితుడిని కాబట్టే తనపై యాక్షన్ తీసుకున్నట్లు ఆరోపిస్తే సమాధానం కూడా ఉండదు. అందుకనే ఏమి చేయాలో అర్ధంకాక ఏదేదో మాట్లాడేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: