ఏదైనా కొత్త వ్యాధి వచ్చిందంటే చాలు డాక్టర్లు కంటే ముందుగానే ఏవి తినాలో ఏవి తినకూడదో ప్రజలే డిసైడ్ చేసేస్తారు. ప్రస్తుతం ఫారం కోళ్లను తినడం ద్వారా కరోనా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో పౌల్ట్రీ కోళ్ల వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.

 

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్.. ఇప్పుడు బిజినెస్ పై కూడా ప్రభావం  చూపిస్తోంది. ఇప్పటికే రిటైల్ రంగాన్ని కుదేలు చేస్తున్న కరోనా.. ఇప్పుడు పౌల్ట్రీ రంగాన్ని భయపెడుతోంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చికెన్ తింటే కరోనా వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో చికెన్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. మార్కెట్లో కిలో 180 నుంచి 200 రూపాయల వరకు పలికిన కోడిమాంసం ధర, కరోనా వైరస్ దెబ్బకు సగానికి సగం పడిపోయింది. 

 

కరోనా వైరస్ చైనా పొలిమేరలు దాటి 26 దేశాలకు విస్తరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది. చైనాలో ఉన్న దిగ్గజ బహుళజాతి సంస్థలే కరోనా దెబ్బకు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి. ఎన్నడూ లేనివిధంగా.. ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపనుంది.

 

కరోనా వైరస్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని చికెన్ ఉత్పత్తుల ఎగుమతి దారులపై పడింది. అదే విధంగా సముద్ర ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపిస్తోంది. చేపలు రోయ్యలు చికెన్ వంటి పలు ఆహార ఉత్పత్తుల వినియోగం క్రమంగా తగ్గుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పౌల్ట్రీ కోళ్ల సాగులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం టాప్ లో ఉంది. ఏపీలో ఉత్పత్తి చేసే  బాయిలర్ కోళ్ల చికెన్ ను విశాఖపట్నం పోర్టు సహా వివిధ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 

 

అయితే కరోనా భయంతో కొంతమందే చికెన్ తినడం లేదని, అవగాహన ఉన్నవాళ్లు పరిశీలించి కొనుగోలు చేస్తున్నారని కొందరు కస్టమర్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొంత మంది కరోనా కు కారణం చికెన్ తినడమే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి దుష్ప్రచారం ఆపాలని పౌల్ట్రీ రంగం కోరుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: