తెలంగాణలో రెండో ప్రధాన నగరమైన వరంగల్ ఐటీ రంగంలో దూకుడు కొనసాగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ఐటీ కంపెనీలు న‌గ‌రంలో ప్రారంభం కాగా, తాజాగా మ‌రో కంపెనీ నేడు ప్రారంభ‌మైంది. వరంగల్‌ అర్బన్ జిల్లా మడికొండ టీఎస్‌ఐఐసీకి ఐటీ పార్కులో మరో ఐటీ కంపెనీ నిర్మాణం ప్రారంభమైంది. క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, ధర్మారెడ్డి, ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

 


జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ భూమి పూజ అనంత‌రం ప్ర‌సంగిస్తూ, వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిద్దేందుకు మంత్రి కేటీఆర్‌ శ్రద్ధతో ఉన్నారని.. వరంగల్ ప్రజల తరఫున మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌కు మరో ఐటీ కంపెనీ రావడం గర్వకారణమన్నారు. వరంగల్‌కు వచ్చే ఐటీ కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ప్రజాప్రతినిధులం అండగా ఉంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. వరంగల్ ఐటీ రంగాన్ని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని… మంత్రి చొరవతో క్వాడ్రంట్ కంపెనీ వచ్చిందని  మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్‌ని ప్రారంభించారని.. రేయన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

 

జిల్లాకు చెందిన మ‌రో మంత్రి సత్యవతి రాథోడ్ ప్ర‌సంగిస్తూ, హైదరాబాద్ తరవాత నగరాలకు విస్తరంచాలన్న ఉద్దేశంతో.. ఐటీ కంపెనీలు వరంగల్‌కు తీసుకొస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో ఐటీ విస్తరణకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. వరంగల్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని.. ఐటీ విస్తరణకు అనుకూలమైన పట్టణం అని తెలిపారు. తన పుట్టిన గడ్డ వరంగల్‌లో ఐటీ కంపెనీ పెట్టడం సంతోషంగా ఉంద‌ని సంస్థ య‌జ‌మాని వంశీ రెడ్డి  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: