కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది . ఇక పార్టీ లో  యువ రక్తాన్ని ఎక్కించాలని నిర్ణయించింది . సీనియర్లను కాదని ఈసారి జూనియర్లకు పదవులు కట్టబెట్టాలని భావిస్తోంది .  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆత్మపరిశీలన లో పడినట్లు తెలుస్తోంది . గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా ఢిల్లీ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం పుంజుకోకపోవడం డేంజర్ బెలేనని  పార్టీ నాయకత్వం గ్రహించినట్లు స్పష్టం అవుతోంది . సీనియర్లను నమ్ముకుంటే లాభం లేదని పార్టీకి  యువ రక్తం  ఎక్కించాలని భావిస్తోన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , త్వరలోనే ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ ద్వారానే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు  సమాచారం .

 

ఈసారి రాజ్యసభ కు తలపండిన వృద్ధులను కాకుండా, యువకులను పంపాలని సోనియా డిసైడ్ అయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దానిలో  భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ని ఈసారి  రాజ్యసభ పంపాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు చెప్పారు . ఒక్క ప్రియాంక నే కాకుండా , పార్టీ బలోపేతమే లక్ష్యంగా  పలువురు యువ నేతలకు రాజ్యసభ స్థానాన్ని కల్పించాలని సోనియా భావిస్తున్నారని అంటున్నారు . రాజ్యసభ లో పార్టీ సీనియర్లయిన అంబికాసోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లాంటి వారి కాలపరిమితి త్వరలోనే ముగియనుంది .

 

ఇక వారికి మరొకసారి రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టకుండా , ఈసారి జూనియర్లకు పెద్దపీట వేసి ప్రయోగం చేయాలని సోనియా యోచిస్తోందని హస్తిన కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అటు లోక్ సభ లో రాహుల్ గాంధీ , ఇటు రాజ్యసభ లో ప్రియాంక లు ప్రభుత్వ విధానాలు ఎండగట్టడం ద్వారా పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం నింపవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: