ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం వరుస ఢిల్లీ పర్యటనలతో విశ్రాంతి లేకుండా గడిపారు. ఈ నెల 12వ తేదీన సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. దాదాపు 90 నిమిషాల పాటు ప్రధాని మోదీతో ఏపీకి సంబంధించిన కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. మోదీతో ప్రధానంగా జగన్ శాసన మండలి రద్దు గురించి, మూడు రాజధానుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. 

 

పోలవరం నిధుల గురించి, విభజన చట్టంలోని అంశాల గురించి మోదీతో జగన్ చర్చించారని సమాచారం. మోదీ జగన్ కు అమిత్ షాను కలవాలని సూచించటంతో జగన్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవటంతో రాష్ట్రానికి చేరుకున్న జగన్ ఫిబ్రవరి 13వ తేదీన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ వేడుకకు హాజరయ్యారు.

 

సీఎం జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత అమిత్ షా అపాయింట్మెంట్ లభించటంతో ఫిబ్రవరి 14వ తేదీన జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు అమిత్ షా జగన్ మధ్య చర్చలు జరిగాయి. జగన్ అమిత్ షాతో ప్రత్యేక హోదా, మండలి రద్దు గురించి చర్చించారు. పోలవరం నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,320 కోట్ల రూపాయలు ఇప్పించాల్సిందిగా కోరారు.

 

రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని చెప్పిన జగన్ న్యాయ శాఖకు కర్నూలుకు హైకోర్టు తరలింపు గురించి ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. శాసన మండలి రద్దుకు కూడా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారు. సీఎం జగన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కూడా కలిసి ఏపీకి సంబంధించిన కీలక అంశాల గురించి చర్చించారు. నిన్న ఉదయం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: