మాజీ సీఎం చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఐటీ దాడులు విషయం వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 2000కోట్ల స్కామ్ కు సంబంధించిన పత్రాలు, కీలక ఆధారాలు దొరికాయని ఐటీ శాఖ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేశ్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. దాదాపు ఐదు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి.

 

అయితే ఇంత జరుగుతున్నా చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ మీడియా ముందుకు వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వడం కానీ ఖండించడం కానీ చేయలేదు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఐటీ దాడులతో పార్టీకేమి సంబంధం అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ మాత్రం నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

మామూలు సమయాల్లో గంటలకు గంటలు ప్రెస్ మీట్లు పెట్టి క్లాసులు పీకే చంద్రబాబు ఇంత పెద్ద విషయం గురించి ఎందుకు నోరు విప్పడం లేదన్నది అర్థం కాకుండా ఉంది. సగటు టీడీపీ అభిమాని కూడా చంద్రబాబు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే వైసీపీ నేతలు చేసే ప్రచారం ఆగుతుందని ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు, లోకేశ్ మాత్రం నోరు విప్పడమే లేదు. కొన్ని ఇంగ్లీష్ పత్రికలు వివరణ అడిగినా.. నో కామెంట్ అనేస్తున్నారట చంద్రబాబు.

 

దీంతో వైసీపీ నేతలు ఇంకాస్త రెచ్చిపోతున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. రూ.2వేల కోట్ల పన్ను ఎగవేత ఆధారాలు దొరికాయని.. ఐటీ శాఖ స్పష్టంగా చెప్పిందని అంటున్నారు. ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీకి చెందిన వారివేనని ఆరోపిస్తున్నారు. తనను తాను మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు కాస్త నోరు విప్పుతారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: