గడచిన కొద్ది రోజులుగా విజయవాడ తెలుగుదేశంపార్టీ ఎంపి కేశినేని నాని తన వ్యాఖ్యలతో చంద్రబాబునాయుడుకు షాకులిస్తున్నారు. పార్టీ లైన్ తో సంబంధం లేకుండానే తన సొంతదారి చూసుకుంటున్నారా ? అనే అనుమానం వచ్చేట్లుగా కేశినేని వ్యవహరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేద్దామని అనుకుంటున్న సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ ఆర్సి బిల్లులకు వ్యతిరేకంగా టిడిపి మద్దతు ఇవ్వాలంటూ బహిరంగ ప్రకటన సంచలనంగా మారింది.  

 

పై బిల్లులను వైసిపి ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేయటం వరకూ ఓకే. అసెంబ్లీలో ముస్లింలకు మద్దతుగా తీర్మానం చేయాలని డిమాండ్ చేయటం కూడా ఓకేనే. అంటే ప్రతిపక్షపార్టీ ఎంపిగా కేశినేని డిమాండ్ చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలే తెలుగుదేశంపార్టీకి ఇబ్బందిగా మారాయి.  పై చట్టాల అమలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసినట్లే ఇక్కడ వైసిపి ప్రభుత్వం కూడా కోర్టులో కేసు వేయాలని చెప్పారు.

 

వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో  ప్రవేశపెట్టే బిల్లుకు  టిడిపి మద్దతు ఇస్తుందని నాని హామీ ఇచ్చేశారు. అలాగే సుప్రింకోర్టులో ప్రభుత్వం గనుక కేసు దాఖలు చేయలేకపోతే కేశినేని నానిగా తాను కేసు వేస్తానని చెప్పటం కచ్చితంగా టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యవహారమే. ఎందుకంటే పై మూడు చట్టాల అమలులో ముస్లింల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ దేశవ్యాప్తంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. అందుకనే పై చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని జగన్మోహన్ రెడ్డి చాలా కాలం క్రితమే ప్రకటించారు.

 

ఇదే విషయంలో జగన్ కు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చ గొట్టటానికి టిడిపి ప్రయత్నం కూడా చేసింది. కేంద్రంలోని బిజెపికి మళ్ళీ దగ్గరవుదామని చూస్తున్న చంద్రబాబు పై బిల్లుల విషయంలో పెద్దగా స్పందించటం లేదు. అలాంటిది  టిడిపి లైన్ కు భిన్నంగా విజయవాడ ఎంపి బహిరంగంగా చేసిన ప్రకటనలు పార్టీలో సంచలనంగా మారింది. మరి ఈ విషయమై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: