ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. 23 సంవత్సరాల వయస్సు గల రమా భార్గవి అనే యువతి గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి ఒకటో బ్లాక్ వార్డులో వాలంటీర్ గా విధులు నిర్వహించేది. ప్రేమ విఫలం కావడంతో నిన్న మధ్యాహ్నం రమా భార్గవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ఇమామ్ హుస్సేన్ అనే యువకుడు రమా భార్గవి నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం ప్రేమించిన రమా భార్గవిని కాదని మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రమా భార్గవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రేమించిన వ్యక్తి లేని జీవితం వృథా అని భావించి పురుగుల మందు తాగింది. 
 
యువతి పురుగుల మందు తాగిన కొంత సమయం తరువాత ఇంటికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు రమా భార్గవి పురుగుల మందు తాగినట్టు గుర్తించారు. యువతిని సమీపంలోని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యువతి తల్లిదండ్రులు మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమా భార్గవి మృతి చెందింది. 
 
యువతి కుటుంబసభ్యులు గుత్తి పోలీస్ స్టేషన్ లో ఇమామ్ హుస్సేన్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో యువతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఇమామ్ హుస్సేన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇమామ్ హుస్సేన్ దొరికితే ఈ కేసులో యువతి ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: