సైన్యంలో పనిచేసే మహిళలకు శుభవార్త..! ఇండియన్‌ ఆర్మీ పర్మినెంట్‌ కమిషన్‌లో మహిళా కమాండోల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం. ఈ ఆదేశాల అమలుకు మూడు నెలల సమయం ఇచ్చింది.

 

సాయుధ బలగాల్లో లింగవివక్షత ముగింపుకు మరో ముందడుగు పడింది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. పర్మినెంట్ కమిషన్‌లో మహిళలకు అనుమతించాలని 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం అమలుచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

ఈ విషయంలో కేంద్రం తీరును సుప్రీం తప్పుబట్టింది. సామాజిక, భౌతిక పరిమితులు, కుటుంబ బాధ్యతలను సాకుగా చూపి మహిళలకు కేంద్రం సమాన అవకాశం కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మహిళా కమాండోల నియమించుకుండా అడ్డుకోవడం రాజ్యాంగంలోని సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధమనీ, వారిని నిరాకరించడం చట్టవిరుద్దమని తెలిపింది. మహిళలు బలహీనమైనవారు కాదని, యుద్ధేతర సేవల్లో ఆర్మీలోని పురుషులతో సమానంగా చూడాలని సూచించింది. సుప్రీం తీర్పుపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

 

అంతకు ముందు మహిళా అధికారులను అంగీకరించడానికి సైన్యంలోని పురుషులు సంసిద్ధంగా లేరని సుప్రీంకు కేంద్రం వివరించింది.  కుటుంబ అవసరాలతో పాటు వారిని యుద్ధ ఖైదీలుగా తీసుకునే ప్రమాదం ఉందని.. శాశ్వత కమిషన్ పొందిన తరువాత కమాండ్ పోస్టింగ్ కోసం మహిళా అధికారుల అభ్యర్ధనను వ్యతిరేఖిస్తున్నారని తెలిపింది. వివిధ భౌతిక ప్రమాణాల ఆధారంగా పోస్టింగ్ విషయంలో మహిళలు, పురుషులను సమానంగా చూడలేమని, ఈ విషయంలో పరిమితులున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

 

ఈ వాదనలను మహిళల తరఫున హాజరైన న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేఖించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మహిళలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని కోర్టుకు తెలిపారు.సుప్రీం ఆదేశాలతో సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలు లభించనున్నాయి.  ఈ తీర్పు అమలుకు కేంద్రానికి మూడు నెలలు సమయం ఇచ్చింది సుప్రీం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: