వరుసగా జరుగుతున్న ముప్పేట దాడులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఒకవైపు పార్టీ పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉండగా మరో వైపు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయపన్ను శాఖలు దాడులు నిర్వహించడం, పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించడం ఇవన్నీ బాబు కి ఇబ్బందికరంగా మారాయి. ఇదే సమయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా తమ పార్టీని, నాయకులను టార్గెట్ చేసుకోవడంతో చంద్రబాబు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. 


చంద్రబాబు బాధను తీర్చేవారు ఇప్పుడు కరువయ్యారు. మొన్నటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ బాబుకి ఆయన పార్టీకి అండగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ పంచన చేరడంతో బాబు కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కి అండగా ఆయన రాజకీయ వారసుడు లోకేష్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏపీలో శాసన మండలి రద్దు, దానికి ముఖ్య కారణమైన మూడు రాజధానుల ఏర్పాటు అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్ పైనా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చినబాబు సిద్ధం అయ్యాడు. మంగళవారం వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీల బృందానికి నాయకత్వం వహించబోతున్న చినబాబు  రాజధాని వ్యవహారంతో పాటు తమ పార్టీ పైనా, చంద్రబాబు మీద జరుగుతున్న రాజకీయ వేధింపులపైనా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. 


రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, కీలక మంత్రులు కొంతమందిని కలిసి తమ బాధ చెప్పుకోవాలని చూసినా వారెవరు సో సారీ అంటూ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసి తమ బాధను చెప్పుకుని ఓదార్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీల టీమ్ సాయంత్రం 5 గంటలకు వెంకయ్యను కలవనుంది. ఈ మేరకు ఉపారాష్ట్రపతి కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: