జాతీయ స్థాయిలో కమలం పార్టీ బలంగా ఉన్నా ఏపీ విషయానికి వచ్చేసరికి చాలా బలహీనంగా ఉంది. కానీ ముందు ముందు అయినా ఆ పార్టీ బలపడేలా ఉందా అంటే ఆ ఆశలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం బీజేపీలోని  రాష్ట్ర నాయకులకు ఎవరికి ఒకే విషయంపై సరైన క్లారిటీ ఉండడం లేదు. పోనీ కేంద్రమైన ఏపీ విషయాల్లో క్లారిటీ ఇస్తుందా అంటే అది లేకపోవడంతో ఏ నాయకుడికి నచ్చిన విధంగా ఆ నాయకుడు తమ నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అయితే సదరు నాయకుల మాటలను వారి సొంత మాటలుగా  తీసుకోవాలా లేక బిజెపి అభిప్రాయం పరిగణించాలా అని అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు.


 వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి శాసన మండలి రద్దు వరకు బీజేపీ నేతలు ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేశారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నిర్ణయం ఇది అని చెప్పిన వెంటనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరో రకంగా మాట్లాడారు. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, సోము వీర్రాజు మరో రకంగా స్పందించారు. దీంతో అసలు బిజెపి అభిప్రాయం ఏంటి అన్నది క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా ఏపీ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రాజమండ్రిలో సమావేశాన్ని నిర్వహించింది. 


బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులు ఎమ్మెల్సీ మాధవ్ సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, పురందరేశ్వరి తదితర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి రద్దు  ప్రస్తావన వచ్చినప్పుడు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ .. మండలిపై  అసలు ప్రజల్లోనే సదభిప్రాయం లేదని, అసలు మండలి ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఇలా ప్రతి విషయంలోనూ నాయకులు ఎవరికి వారుగా ఇష్టమొచ్చినట్టుగా స్పందిస్తూ బిజెపి ని మరింతగా గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: