మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలను ఢిల్లీకి పంపి ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులకు కలిసేలా చేసి శాసన మండలి రద్దు, సీఆర్డీఏ చట్టం రద్దు కేంద్రం ఆమోదించకుండా చేయాలని భావించారు. కానీ అమిత్ షా టీడీపీ ఎమ్మెల్సీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి నిరాకరించారు. 
 
టీడీపీ ఎమ్మెల్సీలు అమిత్ షాను కలిసి శాసన మండలి రద్దు గురించి చర్చించాలని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలకు టీడీపీ అధిష్టానం నుండి ఈరోజు ఢిల్లీ పర్యటన ఉంటుందని సమాచారం అందింది. కానీ అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. ఇప్పటివరకు కేవలం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్‌మెంట్‌ మాత్రమే టీడీపీ ఎమ్మెల్సీలకు దొరికింది. 
 
టీడీపీ ఎమ్మెల్సీలు షా అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో ఢిల్లీకి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం చేకూరదని భావించి పర్యటనను వాయిదా వేసుకున్నారు. గత వారం ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను కలిసి మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు, శాసనమండలి రద్దు గురించి చర్చించారు. శాసన మండలి రద్దు బిల్లుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం తెలపాలని సీఎం జగన్ మోదీ, అమిత్ షాను కోరారు. 
 
సీఎం జగన్ మోదీ, అమిత్ షాను కలిసిన నాలుగురోజులకే టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ అమిత్ షా అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో వాయిదా పడిన టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన కొన్ని రోజుల తరువాత అయినా ఉంటుందా...? లేదా...? అనే సందేహాలు నెలకొన్నాయి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: