వరంగల్‌లో కాళోజీ కళా క్షేత్రం పనుల్లో కదలికలు వస్తున్నాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎమ్మెల్సీ పొచంపల్లి.. కళా క్షేత్రం పనుల పెండింగ్ పై దృష్టి సారించారు.. నిధుల విడుదలకు చొరవ తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో,  నాలుగేళ్ళ గా పెండింగులో ఉన్న పనులకు మోక్షం వస్తుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. 

 

హైదరాబాద్‌ రవీంద్ర భారతికి ధీటుగా హన్మకొండ బాలసముద్రంలో కాళోజీ నారాయణ రావు పేరుతో  కళాక్షేత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యంత అధునాతనంగా కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని ఐదున్నరేళ్ల క్రితం డిజైన్‌ చేశారు. 

 

నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో 12వేల 990 చ.మీ. వైశాల్యంతో భవనాన్ని నిర్మించాలని భావించారు. నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2015-16 నుంచి మూడేళ్లపాటు బడ్జెట్ లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఈ కళాక్షేత్రాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. జీ ప్లస్‌ 4 విధానంలో నాలుగు అంతస్తులుగా నిర్మించేందుకు డిజైన్ చేశారు. 

 

మొదటి దశలో భవనం సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్ పనులు, మూడో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌, పాథ్‌ వే, పార్కింగ్‌ ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా అద్భుత డిజైన్‌తో భవవనిర్మాణం ప్రారంభమైనా.. నిధుల కొరతతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఐదున్నర ఏళ్లు క్రితం ఈ పనులు మొదలుపెట్టినా.. ఇప్పటి వరకూ 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. 

 

చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులపై టీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌,  ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు కాళోజీ కళా క్షేత్రం పనుల జాప్యంపై అరా తీశారు.. నిధుల కొరత తీరేందుకు చొరవ తీసుకున్నారు. స్వయంగా కళా క్షేత్రం స్వయంగా పరిశీలించి పనుల కొనసాగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. త్వరలోనే పనులు జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు.

 

టీఆర్ఎస్ నేతల చొరవపై వరంగల్ జిల్లాలోని సాహితీ లోకం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ పనుల పై దృష్టి సారించడం సంతోషదాయకం అంటున్నారు.  సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి, కాళోజీ కళా క్షేత్రాన్ని అందుబాటులోకి తేవాలని కవులు, కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: