ఏపీలో భూముల రీసర్వే  ప్రక్రియ ప్రారంభమైంది. కార్స్ టెక్నాలజీ ద్వారా బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసి భూ సర్వే చేపట్టాలనేది ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే  చేసేందుకు 65 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టనుంది ప్రభుత్వం.

 

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రక్రియను ప్రారంభించింది. పైలట్ ప్రాతిపదికన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మొదలు పెట్టారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా వినియోగించే బేస్ స్టేషన్ ను ఉపముఖ్యమంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ ప్రారంభించారు. బ్రిటీష్ కాలంలో జరిగిన భూముల సర్వే ప్రస్తుతం తప్పుల తడకగా మారటంతో..  రీసర్వే చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించింది. విదేశాలతో పాటు పరిమితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల  వినియోగిస్తున్న కార్స్  అనే టెక్నాలజీ ద్వారా భూముల రీసర్వే  చేపట్టారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 65 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం. సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకూ గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినా.. ఆ తదుపరి భూ రికార్డులు అన్నీ తప్పుల తడకగా మారటంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు క్రాస్ సాంకేతికత సాయంతో ఉపగ్రహ ఛాయాచిత్రాలు, జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే ప్రక్రియను చేపడుతున్నారు. రీసర్వే ప్రక్రియ అనంతరం రీసర్వే రిజిస్టరును రూపోందించనుంది ప్రభుత్వం.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే రీసర్వే  ప్రక్రియ కోసం మొత్తం 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు భూ రికార్డులను సవరించటం ద్వారా వివాదాలు లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయొచ్చనేది ప్రభుత్వ  ఆలోచన. 

 

ప్రస్తుతం రాష్ట్రంలో 3.31కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నవంబరు 1వ తేదీన ఈ ప్రక్రియ మొదలు కానుంది. 2022 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ  రికార్డుల ద్వారా ఉత్పన్నమయ్యే వివాదాలను తగ్గించే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ  లక్ష్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: