ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళిన ఆయన ఈ మూడో దశ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి వేదిక వద్దే వృద్దులకు కంటి పరిక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆస్పత్రుల అభివృద్ధి కి తీసుకునే చర్యలపై జగన్ మాట్లాడారు. అదే విధంగా నాడు నేడు కార్యక్రమం కోసం ఎన్ని నిధులు కేటాయించింది జగన్ లెక్కలతో సహా చెప్పారు. 

 

ఇక ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేసారు జగన్. ఇంత మంచి పరిపాలన జరుగుతున్నప్పుడు అసూయ, ఈర్ష్య ఉండటం సాధారణమని అన్నారు. తనపై చంద్రబాబు నాయుడు, విపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో మీరు అంతా చూస్తున్నారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జగన్. అలాగే ఆరోగ్య శ్రీ లో క్యాన్సర్ కి మందు ఉంది గాని ఈర్ష్య తో వచ్చిన కడుపు మంటకి వైద్యం లేదని, చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది గాని, చెడు దృష్టికి ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు అంటూ జగన్ పంచ్ వేసారు. 

 

వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి గాని మెదడు కుళ్ళితే చికిత్సలు లేనే లేవు అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను మహానుభావులు గా చూపించే కొంత మంది చానల్స్ ఉన్నాయని, కొన్ని పత్రికలూ ఉన్నాయని, వాళ్ళను బాగు చేసే మందులు కూడా ఎక్కడ లేవని ఎద్దేవా చేసారు. వీటి అన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తూ ఉన్నాడని, నిజాయితీగా పని చేస్తూ ఉన్నామని, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించే విధంగా, పిల్లలు అభివృద్దిలోకి వచ్చే విధంగా చదువులు చెప్పిస్తూ ఉన్నామని అన్నారు ముఖ్యమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: