కోవిడ్ 19 వ్యాధి విస్తరిస్తూనే ఉంది. వందలమంది ప్రాణాలను తీసిన వైరస్ భూతాన్ని నిలువరించేందుకు చైనా నానా అగచాట్లు పడుతోంది. నగదును కూడా మార్చాలని డిసైడ్ అయింది. చైనా నుంచి భారత్ వచ్చిన వారెవరికి వ్యాధి సోకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరందరినీ దశల వారీగా స్వస్థలాలకు పంపనున్నారు. 

 

చైనాలో కోవిడ్ వైరస్ విజృంభణ ఆగడం లేదు. ఓ వైపు కొందరు కోలుకుంటున్నా.. మరెంతో మంది మరణిస్తున్న కొత్తవారికి వైరస్ సోకుతూనే ఉంది. తాజాగా 2వేల 9మందికి వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వల్ల వచ్చే కోవిడ్-19 వ్యాధితో మరో 142 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. ఒక్కచైనాలో 68వేల మందికి వ్యాధి సోకగా 1665 మంది మృత్యువాత పడ్డారు. చైనా వెలుపల 30 దేశాల్లో కోవిడ్ కేసులు నమోదుగా కాగా 500మందికి వ్యాధి సోకింది. అయితే వ్యాధిని అ్డడుకునేందుకు చైనా చేపడుతున్న చర్యలు ఇప్పుడిప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెడుతున్నాయి. గత మూడురోజులుగా వైరస్ సోకుతున్న వారిసంఖ్య తగ్గుతోందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 

 

వైరస్ మరింత ప్రబలకుండా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా నగదుతో వైరస్ సోకే అవకాశం ఉన్నందున.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. వుహాన్ సహా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సుల్లో నగదును తీసుకొని.. తిరిగి ప్రజలకు ఇవ్వబోమని అధికారులు చెబున్నారు. 85.6 బిలియన్ల డాలర్ల యువాన్లను ముద్రిస్తున్నామని అధికారులు తెలిపారు. పాత నగదును తీసుకొని.. కొత్త నోట్లను చెలామణి చేస్తామని చెప్పారు. పాత నోట్లను 14 రోజుల వరకు ఇతర చోట నిల్వ చేస్తామని చెప్పారు. లేదంటే అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేసి.. వైరస్ జాడ లేదని నిర్ధారించుకొన్న తర్వాత తిరిగి చెలామణి చేస్తామని స్పష్టంచేశారు. 

 

అటు జపాన్ సమీపంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ క్యూయిజ్ లో మాత్రం వైరస్ రోజురోజుకి విస్తరిస్తోంది. 40మంది అమెరికన్లకు కోవిడ్ -19 సోకినట్లు అనుమానిస్తుంది అమెరికా. వీరిని జపాన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ షిప్‌లో 3800మంది వరకు ఉండగా ఇప్పటికే మూడు వందల మందికిపైగా వైరస్ సోకింది. 

 

ఇక భారత్‌కు వస్తే, చైనా నుంచి స్వదేశానికి వచ్చిన 406 మంది భారతీయులకు కొవిడ్ - 19 సోకలేదని తేలింది. ప్రత్యేక విమానంలో వారిని వెనక్కి రప్పించిన ప్రభుత్వం, హర్యానాలో  మిలిటలీ స్థావరానికి తరలించి పరీక్షలు జరిపింది. ఇండో టిబెటన్‌ సరిహద్దు దళం కేంద్రంలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక్కడున్న వారందరికీ కొవిడ్‌ నెగెటివ్‌గా తేలింది. దీంతో వీరిని దశలవారీగా స్వస్థలాలకు పంపనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: