ఎగిరి దంచినా అంతే కూలీ ఎగరకుండా దంచినా అంతే కూలీ అన్నట్టుగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అలా తయారవ్వడమే కాదు కాంగ్రెస్ హై కమాండ్ కూడా అదేవిధంగా ఆలోచిస్తోంది. ప్రస్తుతం తెలీనంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారవ్వడంతో ఆ పార్టీ నాయకులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రథ సారధిని నియమించాలని ఎప్పటి నుంచో కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తూ వస్తోంది. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షా పదవిపై చాలామందే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. 


కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఆ పదవి భర్తీని మాత్రం చేపట్టడంలేదు. దీంతో ఆ పదవి ఆశిస్తున్నా నాయకులంతా మరింతగా నిరాశ నిస్పృహల్లో ఉండిపోయారు. ఇదిగో అదిగో అని చెబుతూ రావడమే కానీ అధ్యక్ష పదవిలో ఎవరిని కూర్చోబెట్టడంలేదు అధిష్టానం. పార్టీ ఇంచార్జ్ కుంతియా కూడా ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష మార్పుపై ఎటువంటి వాఖ్యలూ చేయలేదు. కనీసం అలాంటి సంకేతాలు కూడ ఇవ్వలేదు. కానీ పార్టీలో సీనియర్లు విహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు మాత్రం ఆ పదవి పై ఆశలు పెట్టుకుని ఢిల్లీ స్థాయిలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.


పిసిసి అధ్యక్షుడి మార్పు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందని, నేతలు పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లడంతో చాలా నియోజకవర్గాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీకి కలిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చేసింది .ఈ పరిస్థితుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం కష్టమనే భావన లో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి వంటివారు అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. 


ఇటువంటి సమయంలో ఇద్దరిలో ఏ ఒక్కరికి పదవి ఇచ్చినా ఒకరు వేరే పార్టీలోకి వెళ్లడం ఖాయం అని గుర్తించింది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మరింత దీన స్థితికి వెళ్ళిపోతుందనే ఆలోచనతో కొత్తగా పిసిసి అధ్యక్షుడు నియామకం చేపట్టి అనవసర తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలి అనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందుకే మరికొంత కాలం పి సి సి అధ్యక్షుడి నియామకం వాయిదా వేయాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: