ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే వారు సొంత పార్టీ వారైనా.. ప్రత్యర్థి పార్టీ వారైనా ఎంత స్థాయి వారైనా వెనకా ముందు ఆలోచించకుండా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. తాను అనుకున్నది ఏమిటో ముక్కుసూటిగా చెప్పగల వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. తనకు సంతోషం వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆగ్రహం వచ్చినా అదేవిధంగా వెంటనే చూపిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో మంచి ఉత్సాహంగా ఉన్న కేసీఆర్ ఈరోజు పట్టణ ప్రగతిపై చైర్పర్సన్ లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీ అంటే మురికికి పర్యాయపదంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆ చెడ్డ పేరు పోవాలంటే సమర్థవంతంగా, పారదర్శకమైన విధానాలు పాటిస్తూ అన్ని రంగాల్లోనూ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. అవినీతి రహిత వ్యవస్థ తెలంగాణలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ అందరికీ ఆదర్శంగా ఉండాలని, దీనికోసం ప్రణాళికాబద్ధంగా మీరంతా పనిచేయాలని సూచించారు.


ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి.. పనులు చేయడం పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, పని చేస్తే ఆరు నెలల్లోనే మీ మీ పట్టణాలు మంచి గా ఉంటాయని కెసిఆర్ అన్నారు. నిధుల కొరత ఎప్పుడూ ఉండేదే అని దానికి తగినట్టు పట్టణాలను మార్చుకుని తగిన ప్రణాళికతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి అని, ఒకప్పుడు రాజకీయాలు అంటే చాలా కష్టం, త్యాగాలతో ఉండేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. మీరు ఎక్కడా ఆడంబరాలకు వెళ్లకుండా ప్రజలకు మేలు జరిగే విషయాలపై శ్రద్ధ వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా అనేక సలహాలు సూచనలు కేసీఆర్ కొత్తగా ఎంపికైన మేయర్లు, చైర్మన్లకు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: