ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు ఉన్నాయా? అంటే అబ్బే అలాంటివి ఏం లేవని ఖచ్చితంగా చెప్పేయొచ్చు. ముఖ్యంగా మన ఏపీ రాజకీయాల్లో అలాంటి విలువలు ఎప్పుడో అటకెక్కేసాయి. అసలు ఇప్పుడున్న పార్టీలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం చాలా కష్టం.  రాజకీయంగా విమర్శలు కాస్త, వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లిపోయాయి. ఇలాంటి వాటికి అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలేమీ అతీతంగా లేవు. అందరూ అదే బడిలో ఉన్నట్లున్నారు.

 

అయితే ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడంలో ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార వైసీపీనే ముందుంది. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎక్కువ బాధ్యతతో ఉండాల్సింది పోయి, మరింత ఘాటుగా విమర్శించడం చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలామంది అదే పనిలో ఉన్నారు. రాజకీయంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

ఇక వీరిలో ఈ మధ్య పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ పెళ్లిళ్ల గురించి చాలా తీవ్రమైన విమర్శలే చేశారు. సరే ఆ విమర్శ ఎప్పుడు చేసేదే కాబట్టి దాన్ని వదిలేస్తే, ఇటీవల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్‌, చంద్రబాబులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రాయడానికి వీల్లేని భాషలో తిట్టారు.  ఈ తిట్లకు ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి మీదకు కూడా వెళ్లారు.  ద్వారంపూడి తర్వాత పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ తాజాగా, పవన్‌ని పిచ్చి కుక్క అంటూ మాట్లాడారు.

 

దీంతో జోగిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. పైగా పవన్ సామాజికవర్గమైన కాపులు కూడా ఈ వ్యాఖ్యల పట్ల కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో జగన్‌కు మద్ధతు తెలిపిన కాపులు...ఇప్పుడు వైసీపీ నేతలు మాటలు చూసి ఆగ్రహంతో ఉంటున్నారు. తాము ఏ పార్టీలో ఉన్న, ఇలా ఓ మనిషిని వ్యక్తిగతంగా తిట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. వైసీపీ నేతలు ఈ విధంగా చేయడం వల్ల ప్రజల మేలు కోసం కష్టపడుతున్న సీఎం జగన్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశముందని వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ నేతలు కొంపముంచేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: