అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణం కోసం కేంద్రం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది.  ఆల‌య నిర్మాణం కోసం ట్ర‌స్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అయితే తాజాగా ఆ న‌గ‌ర ముస్లిం ప్ర‌జ‌లు ట్ర‌స్టు అధిప‌తి లాయ‌ర్ కే ప‌ర‌శ‌ర‌న్‌కు ఓ లేఖ రాశారు.  రామాల‌య నిర్మాణం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ఉంద‌ని ఆ లేఖ‌లో ముస్లింలు ఆరోపించారు. 

 

సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ట్ర‌స్టును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ధ్వంసం చేయ‌బ‌డ్డ బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో ముస్లింల స‌మాధులు ఉన్నాయ‌ని, ఆ స‌మాధుల‌పై రామాల‌యాన్ని నిర్మించ‌డం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని ముస్లిం త‌ర‌పున న్యాయ‌వాది ఎంఆర్ శంషాద్ ఆ లేఖ‌ను ఈనెల 15వ తేదీన ట్ర‌స్టుకు పంపారు. 1885లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో సుమారు 75 మంది ముస్లింలు చ‌నిపోయార‌ని, వారి స‌మాధులు అక్క‌డే ఉన్నాయ‌ని, బాబ్రీ మ‌సీదు ప్రాంతాన్ని శ్మ‌శాన‌వాటిక‌గా వాడార‌ని, అలాంటి చోట రామాల‌యాన్ని ఎలా నిర్మిస్తార‌ని ఆ లేఖ‌లో ప్ర‌శ్నించారు.  ముస్లింల స‌మాధుల‌పై రాముడి జ‌న్మ‌స్థాన ఆల‌యాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తుందా అని, ట్ర‌స్టు దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేఖ‌లో కోరారు. 67 ఎక‌రాల భూమిలో సుమారు 5 ఎక‌రాల స్థ‌లంలో ముస్లింల శ్మ‌శాన‌వాటిక ఉంద‌ని శంషాద్ తెలిపారు.  మొత్తం 67 ఎక‌రాల భూమిని ఆల‌య నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు న్యాయ‌వాది తెలిపారు.  

 


రామాల‌యం అభివృద్ధి కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ట్ర‌స్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు, ఆ ట్ర‌స్టుకు శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్రం అని పేరు పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మెదీ చెప్పారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.  ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు సంతోషిస్తున్న‌ట్లు చెప్పారు.  శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్రం.. స్వ‌తంత్య్ర సంస్థ‌గా ప‌నిచేస్తుంద‌న్నారు.  రామ మందిరాన్ని సంద‌ర్శించే భ‌క్తుల కోసం మ‌రో భారీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మోదీ చెప్పారు.  మందిరం వ‌ద్ద ఉన్న 67 హెక్టార్ల భూమిని ట్ర‌స్టుకు కేటాయిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలో జీవిస్తున్న ప్ర‌తి మ‌తానికి చెందిన వారు ఉన్న‌తంగా జీవించాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు.  హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్త‌వులు, బౌద్దులు, పార్సీలు, జైనులు అంద‌రూ ఒక కుటుంబంలో భాగ‌మ‌ని, కుటుంబంలో ప్ర‌తి ఒక్క స‌భ్యుడి అభివృద్ధిని కాంక్షిస్తున్నామ‌ని అన్నారు.  స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న విధానంతో త‌మ ప్ర‌భుత్వం ముందుకు వెళ్తున్న‌ద‌ని,  ఆ విధానం వ‌ల్ల అంద‌రూ సంతోషంగా ఉండాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు. అయితే, తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన ఈ ప‌రిణామం రామాల‌యం నిర్మాణంను ఏ విధంగా మార్చ‌నుందో అనే ఆసక్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: