తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందరి  కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం, యర్రగుంట్ల –నంద్యాల సెక్షన్ విద్యుదీకరణ  సహా గుంతకల్లు-కల్లూరు మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రాంభించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం చేశారనడం అవాస్తవమన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలోనే దక్షిణ మధ్య రైల్వేను నిర్లక్ష్యం చేశారని , రూ.258 కోట్లతో తెలంగాణలో పలు రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యర్రగుంట్ల-నంద్యాల లైను విద్యుదీకరణకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ద్వారా అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

 

ఎంఎంటీఎస్‌ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం తరపున సహకారం అందితే త్వరితగతిన పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ హాయాంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,602 కోట్లు కేటాయించినట్లు మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్య అని సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని, చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టర్మినల్‌ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు.

 

దీని నిర్మాణానికి ఉన్న ప్రాధాన్యాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు వివరించగా ఈ ప్రాజెక్టును ఆయన మంజూరు చేసినట్లు వెల్లడించారు.  ఎంఎంటీఎస్‌, సబ్బరన్‌ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. శాటిలైట్ టెర్మినల్‌ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులు నగరం మధ్యలోని ప్రధాన స్టేషన్లకు వెళ్లకుండా ఉపయోగపడుతుందని, ఇది రెండో దశ ఎంఎంటీఎస్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

 

యాదగిరి గుట్ట వరకూ ఎంఎంటీఎస్ పూర్తయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌, , సి.ఎం రమేశ్, ధర్మపురి అరవింద్‌లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: