హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే.. ఆ అనుభవంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తా.. ప్రపంచంలోని అత్యుత్తుమ రాజధానుల్లో అమరావతి అగ్రస్థానంలో ఉంటుంది.. ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్ చేస్తా.. ఎవరైనా ప్రపంచంలో ప్రశాంతంగా ఆనందంగా బతకాలంటే మన అమరావతి వైపే చూసేలా చేస్తా.. ఇదీ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు అరచేతిలో చూపించిన వైకుంఠం.

 

 

కానీ ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా అమరావతిని కేవలం భ్రమరావతిగానే ఉంచేశారు చంద్రబాబు.. గ్రాఫిక్కులు, గాలి మేడలు తప్ప.. రాజధాని ప్రాంతంలో ఒకటీ అరా తప్ప భవనాలు లేవలేదు. ఈ గ్రాఫిక్కుల ఓవర్ యాక్షన్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తీసింది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఇవే డైలాగులు కొడుతున్నారు. విశాఖను రాజధానిగా మార్చుకుంటున్న వైసీపీ సర్కారు.. విశాఖ విషయంలో మళ్లీ బాబు బాటలోనే వెళ్తున్నారు.

 

 

త్వరలోనే విశాఖ ప్రపంచ స్థాయి మహానగరంగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ డాంబికాలు పలికారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

 

 

అంతే కాదు.. 2024నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంటుందన్నారు. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉందని, వైఎస్సార్‌ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ఏదైనా చేసి చూపిస్తే జనం నమ్ముతారు.. కేవలం మాటలు చెబితే నమ్మరని వైసీపీ మంత్రులు గ్రహిస్తే మంచిదేమో. అందులోనూ ఏకంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. ప్రపంచ పటంలో పెడతాం వంటి డైలాగులు తగ్గించుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: