ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన వాగ్బాణాలతో రెచ్చిపోయారు. నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్టుగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా.. ఆయన అనుకూల మీడియా పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నా.. టీడీపీ, ఆ పార్టీకి సహకరించే మీడియా పదే పదే ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న భావనలో ఉన్న సీఎం ఆ విషయంపై కర్నూలు పర్యటనలో కుమ్మేశారు.

 

 

ఆయన తన ప్రసంగంలో ఏమాత్రం మొహమాటపడకుండా.. సూటిగా.. ఘాటుగా విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. “ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ మేలు చేస్తుందని గర్వంగా చెబుతున్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తున్నప్పుడు సహజంగా ఓర్వలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎంతటి కడుపు మంట ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబులో ఆ కడుపు మంట మరి ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు ఉచితంగా వైద్యం చేయించవచ్చు కానీ..అసూయతో వచ్చే కడుపు మంటకు ఎక్కడ వైద్యం చేయించే అవకాశం లేదు.

 

 

" కంటి చూపు మందగిస్తే..కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ..చెడు దృష్టికి ఎక్కడా చికిత్స లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ..మెదడు కుళ్లితే చికిత్సలు లేనే లేవు. ఇలాంటి లక్షణాలు ఉన్నా మనుషులను మహానుబావులుగా చూపించే కొన్ని చానల్స్‌, పత్రికలు ఉన్నాయి. వాళ్లను బాగు చేయించే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య మీ బిడ్డ ..మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీగా పని చేస్తున్నాను.

 

 

" ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. వ్యవసాయానికి అండగా ఉన్నాం. ప్రజలందరి ఆరోగ్యం, ఆనందం కోసం గట్టిగా నిలబడుతాను. ప్రతి ఒక్కరి తోడ్పాటు కోసం మీ బిడ్డకు ఎల్లప్పుడు మీ చల్లని దీవెనలు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అంటూ ముగించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: