పేదలకు అండగా ఉండేందుకే టిడిపి ‘‘ప్రజా చైతన్యయాత్ర’’లు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం పార్టీ సీనియర్లతో భేటిలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, పేదలకు అండగా ఉండేందుకే ప్రజా చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు. ‘‘ప్రజా చైతన్యయాత్ర’’లను వినూత్నంగా నిర్వహించాలని నేతలకు సూచించారు. 


 ఇంటింటికి వెళ్లాలి, ప్రతిఒక్కరిని పలకరించాలని అన్నారు. గ్రామ గ్రామానా పార్టీ జెండా ఆవిష్కరణలు జరపాలని సూచించారు. ఎన్టీఆర్, అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ తదితర మహానీయులకు  నివాళులు అర్పించాలి అన్నారు చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ విస్తృత సమావేశాలు జరపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను చర్చించాలి, కార్యకర్తలపై వేధింపులను నిరసించాలని పిలుపునిచ్చారు. ప్రజా చైతన్య యాత్రల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. చేసిన కార్యక్రమాలను కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. 

 

అన్ని చోట్లా ప్రెస్ మీట్లు నిర్వహించాలన్న ఆయన బలహీనవర్గాల పార్టీ ప్రతినిధుల ఇళ్లు సందర్శించాలని, అందరూ సంఘటితంగా ఉంటే దేనినైనా ఎదుర్కోగలమన్నారు. పేదల వ్యతిరేక వైసిపి పాలనను నిరసించాలని పిలుపునిచ్చారు. కార్డులు కోల్పోయిన కుటుంబాలను పలకరించాలన్న ఆయన, పించన్లు కోల్పోయిన వారిని పరామర్శించాలన్నారు. వైసిపి దుర్మార్గ నిర్ణయాలు జనం ప్రాణాలు తీశాయని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, పంటలకు ధరలేక 290మంది రైతుల ఆత్మహత్యలు, ఇసుక కొరతతో 60మంది భవన కార్మికులు, రాజధానికి భూములిచ్చిన 45 రైతులు, రైతుకూలీల మృతి చెందారు అన్నారు. 

 

పించన్లు ఆపేశారనే ఆవేదనతో గుండెలు ఆగాయన్నారు. ప్రజలను బతికించడానికే ప్రభుత్వాలు.. ప్రజలను చంపే పాలకులను ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు. ప్రజలను హింసించడం, విద్వేషాలు రెచ్చగొట్టడమే వైసిపి అజెండా అంటూ మండిపడ్డారు చంద్రబాబు. వైసిపి నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ఇసుక, సిమెంటు ధరలను భారీగా పెంచేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, మద్యం రేట్లు, కరెంటు ఛార్జీలు పెంచారని, పేద కుటుంబాలను ఆర్ధికంగా దెబ్బతీశారని, బిసి,ఎస్సీ కార్పోరేషన్ల నిధులను దారి మళ్లించారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: