ఏపీలో మండలి పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. మండలి చైర్మన్‌ ఫిర్యాదుతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మండలి సెక్రటరీపై చర్యలు ఉంటాయా....సెలక్ట్ కమిటీలు ఏర్పాటు అవుతాయా.. అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ తో కౌన్సిల్ చైర్మన్ భేటీ తర్వాత ఏమవుతుందోననే ఉత్కంఠ అందరిలో ఉంది. 

 

ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సెలక్ట్ కమిటీల విషయంలో సెక్రటరీ ధిక్కారం పై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సభలో ఇచ్చిన రూలింగ్ ను అమలు చెయ్యకపోవడంపై షరీఫ్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గత మూడు వారాలుగా సభలో, సభ అనంతరం జరిగిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. సెక్రటరీ పూర్తిగా నిబంధనలు  ఉల్లంఘించారని...చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను మండలి సెక్రటరీ కోరారు. 

 

మండలిలో అధికారులపై చైర్మన్ ఫిర్యాదు అనేది చిన్న విషయం కాదనే వాదన వినిపిస్తోంది. అధికారులు సభను ధిక్కరించినట్లుగా దీనిని చూడాలని చెపుతున్నారు. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు అనేది అత్యంత కీలకంగా మారింది. సెక్రటరీపై చర్యలు తీసుకున్నా...అతనిని వివరణ కోరినా....పెద్ద ఘటనగానే చూడాల్సి ఉంటుంది. గవర్నర్ వివరణ కోరితే.. మండలి సెక్రటరీ ఎం చేస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. సెక్రటరీని ఆ పోస్టు నుంచి తప్పించాలని కౌన్సిల్ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే...అధికార పార్టీ కూడా డిఫెన్స్ లో పడుతుంది. సెక్రటరీ నిర్ణయానికి వైసిపి మద్దతు పలుకుతోంది. ప్రభుత్వం, మంత్రుల ఒత్తిడి కారణంగానే సెక్రటరీ చైర్మన్ ఆదేశాలు అమలు చెయ్యడం లేదని టిడిపి ఆరోపిస్తుంది. ఒక వేళ గవర్నర్ ఈ అంశాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది తప్పినట్లే.

 

శాసన సభలో గాని, శాసన మండలిలో గాని సెక్రటరీ నియామకం గవర్నర్ చేస్తారు. దీంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం గవర్నర్ కు ఉంటుంది. ఒక వేళ వారిపై నేరుగా చర్యలు తీసుకోకపోయినా.....ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ ప్రభుత్వ వివరణ కోరే అవకాశం కూడా ఉన్నట్లు టీడీపీ అంచనా వేస్తోంది. అయితే విషయం అంత వరకు వెళుతుందా...గవర్నర్ ఆ స్థాయి స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: