ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరుపై, ఉద్యోగాల కల్పన గురించి ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ సీఎం జగన్ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడంలో కొంత విఫలమవుతున్నారని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 
 
ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ కీలకమైన విషయాలలో మాత్రం జగన్ వేగం పెంచాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజల్లో మెజారిటీ శాతం హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మూడు రాజధానుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. 
 
పోలవరం ప్రాజెక్ట్, ఇతర కీలక అంశాల గురించి కూడా రాష్ట్ర ప్రజల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా దిశగా జగన్ ప్రయత్నాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. పథకాల అమలు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం సర్వేల పేరుతో కొంతమంది అర్హులైనా జాబితా నుండి తొలగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఆ తరువాత తప్పులను సరిదిద్దుకుంటున్నా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. 
 
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అధికారంలో వైసీపీ పార్టీ ఉంది కాబట్టి ఫలితాలు కూడా వైసీపీ పార్టీకే అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వంపై గతంతో పోలిస్తే కొంత వ్యతిరేకత పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందడుగులు వేయడంతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో కొంత వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: