చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచంలోని దేశాలన్నింటినీ గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 2118 మంది మృతిచెందారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది. ఒక పక్క కరోనా వైరస్ వ్యాపిస్తుందేమోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనప్పటికీ తాజాగా మరో వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. H1N1 వైరస్‌ బారిన  పడుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన ఈ వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలపై ప్రభావం చూపుతోంది. H1N1 వైరస్‌ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో 63 కేసులు నమోదయ్యాయి. 
 
63 మంది స్వైన్ ఫ్లూ బారిన పడగా వీరిలో ఐదుగురు ఇప్పటికే మరణించారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపనుంది. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, క్యాన్సర్ బారిన పడిన వారికి, ఆస్తమా రోగులకు, గర్భిణీ స్త్రీలకు సోకుతుంది. 
 
వైద్యులు ఈ వ్యాధి బారిన పడకుండా తగిన జగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన ఈ వైరస్ ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో బలి తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల నుండి స్వైన్ ఫ్లూ కేసులు 30 నమోదయ్యాయని తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ బారిన పడిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, ఇతర లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి బారి నుండి బయటపడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: