దేశ‌వ్యాప్తంగా త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్య‌స‌భ ఎన్నికల హడావిడి మొదలైంది.. శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో.. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి వస్తే చాలు అని భావించిన వాళ్లు సైతం ఇప్పుడు రాజ్య‌స‌భ సీట్ల‌పై క‌న్నేశారు. శాస‌న మండ‌లిలో సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అదే రాజ్య‌స‌భ‌లో వైసీపీకి ల‌భించేవి కేవ‌లం నాలుగు సీట్లు మాత్ర‌మే. కానీ ఇక్క‌డ ఆశావాహులు చాలా మందే ఉన్నారు.



ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో వివిధ పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. నిన్న‌టి వ‌ర‌కు మంత్రులు, ఎమ్మెల్సీలుగా ఉన్న ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబాబోస్ ఈ రేస్‌లో ముందు వరసలో ఉన్నారనే ప్రచారం సాగగా.. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు పెద్దల సభ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. ఇక ఇప్ప‌డు కొత్త‌గా మ‌రికొన్ని పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.



ఈ కొత్త పేర్ల‌లో సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్‌.ష‌ర్మిల‌తో పాటు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జస్టిస్ చలమేశ్వర్, మెగాస్టార్ చిరంజీవి పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్రంలో సుదీర్ఘ‌మైన పాద‌యాత్ర చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగినా చేయ‌లేదు. ఇక ఇప్పుడు పార్టీ కోసం సోద‌రి చేసిన త్యాగాల నేప‌థ్యంలో ఆమెకు ప‌ద‌వి ఇవ్వాల‌న్న ఒత్తిడి జ‌గ‌న్‌పై ఉంద‌ని తెలుస్తోంది.



తన కేబినెట్ మంత్రి అయిన.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను కూడా పెద్దల సభకు పంపే ప్లాన్ ఉందనే ప్రచారం సాగుతోంది... శాసన మండలి రద్దైతే.. ఆయన మంత్రి పదవి పోతుంది. ఆయ‌న పార్టీ కంటే కూడా జ‌గ‌న్ ఫ్యామిలీకి వీర విధేయుడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇటీవ‌ల చిరు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  సైరా మూవీ రిలీజ్ తర్వాత వైఎస్ జగన్‌ను ప్రత్యేకంగా కలిసిన ఆయన.. రాజధానులపై సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనను సమర్థిస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పుడు చిరు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ఉండ‌డంతో చిరు మ‌న‌స్సులో ఏముంది ?  చిరు విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్‌తో ఉన్నార‌న్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: