మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను, అప్పుల వివరాలను ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుండి ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని నారా లోకేష్ చెప్పారు. ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు బిజీగా ఉన్నారని అందువలనే తాను ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నానని నారా లోకేష్ తెలిపారు. 
 
చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది 85 లక్షల రూపాయలు పెరిగాయని లోకేష్ చెప్పారు. చంద్రబాబుకు అప్పులు 5.13 కోట్ల రూపాయలు , ఆస్తులు 3.87 కోట్ల రూపాయలు అని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి ఆస్తి 53 కోట్ల రూపాయల నుండి 50 కోట్ల రూపాయలకు తగ్గిందని లోకేష్ చెప్పారు. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షల రూపాయలని, దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షల రూపాయలు అని చెప్పారు. 
 
నారా లోకేష్ ప్రకటించిన వివరాల ప్రకారం చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు 119.42 కోట్ల రూపాయలుగా మొత్తం అప్పులు 26.04 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కుటుంబం నికర ఆస్తుల విలువ 93.38 కోట్ల రూపాయలు అని నారా లోకేశ్ చెప్పారు. తాను టీడీపీ పార్టీలోకి రాజకీయాల్లోకి యువరక్తం రావాలనే ఆలోచనతోనే వచ్చానని ప్రమాద బీమా ద్వారా 4300 కుటుంబాలను ఆదుకున్నామని లోకేష్ తెలిపారు. 
 
తమపై, తమ కుటుంబంపై ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారు వారి ఆస్తుల వివరాలను ప్రకటించాలని నారా లోకేష్ కోరారు. వైసీపీ ప్రభుత్వం తమపై ఆరోపణలు చేస్తుందే తప్ప ఆ ఆరోపణలను నిరూపించలేకపోయిందని లోకేష్ చెప్పారు. తన తల్లి భువనేశ్వరి 23 సంవత్సరాలుగా హెరిటేజ్ తో పని చేస్తోందని లోకేష్ అన్నారు. రాజధాని బయట హెరిటేజ్ కు తొమ్మిది ఎకరాల భూమి ఉందని లోకేష్ అన్నారు. లోకేష్ ప్రకటించిన ఆస్తుల గురించి నెటిజన్లు ఆశ్చర్యపోతూ చంద్రబాబు కుటుంబం ఆస్తులు ఇంత తక్కువా...? అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: