గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం...దివంగత కోడెల శివప్రసాద్ సొంత గడ్డ. ఎన్నో ఏళ్లు ఆయనకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది మొదలు...అంటే 1983, 1985, 1989, 1994, 1999 ఇలా వరుసగా అయిదుసార్లు నరసారావుపేట నుంచి విజయం సాధించారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన కోడెల...2014లో సత్తెనపల్లికి మారిపోయారు.

 

ఇక ఇక్కడ నుంచే నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాగా వేయడానికి అవకాశం దొరికింది. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసిన గోపిరెడ్డి, టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి నల్లబోతు వెంకటరావుని ఓడించారు. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఐదేళ్లు గడిపిన గోపిరెడ్డి, 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

 

రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు, వైసీపీ కూడా అధికారంలోకి రావడం కలిసొచ్చింది. ఈ 9 నెలల కాలంలో బాగానే పనులు చేసుకోగలుగుతున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, వారికి ప్రభుత్వ పథకాలని అందిస్తున్నారు. ఇక ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నారు. అలాగే రోడ్ల మరమ్మత్తులు, సి‌సి రోడ్ల నిర్మాణం, డ్రైన్స్, అంగన్ వాడీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న కోటప్పకొండ ఆలయ అభివృద్ధికు కూడా పాటుపడుతున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలని ఘనంగా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

నియోజకవర్గం పనుల విషయంలో ముందున్న గోపిరెడ్డి, ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు ధీటుగా జవాబు ఇవ్వడంలో వెనుకపడే ఉన్నారు. అయితే తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో గోపిరెడ్డి కాస్త అటు ఇటుగా ఉన్నారు. తన నియోజకవర్గం పక్కనే అమరావతి ఉండటంతో, రాజధానిగా అమరావతినే ఉండాలని అనుకుంటున్నారు. కాకపోతే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా చెబుతున్నారు.

 

గోపిరెడ్డి తప్పక మూడు రాజధానులకు మద్ధతు ఇవ్వడాన్ని అక్కడ ప్రజలు అర్ధం చేసుకున్నట్లే ఉన్నారు. దీంతో నరసారావుపేటలో గోపిరెడ్డికి సానుకూల వాతావరణమే ఉంది. పైగా కోడెల లేకపోవడం, నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ నాయకుడు లేకపోవడం గోపిరెడ్డికి ఇంకా కలిసొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: