ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతోపాటు ఇంకొందరు దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ ఎందుకు అవసరంలేదో కోర్టుకు ఆయన వివరించారు.                                

 

 

వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషనర్ల వాదనలు గత గురువారం(ఈనెల 13న) ముగిశాయి. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఏపీ పోలీసులు సాక్ష్యాలు సంపాదించలేకపోయారని, జగన్ సర్కారుపై నమ్మకంలేకే కేంద్ర సంస్థను కోరుతున్నామని వివేకా కుటుంబీకులు, టీడీపీ నేత బీటెక్‌ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో వాదించారు. దానికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం ఇవాళ (20న)వాదనలు వినిపించింది. వివేకా కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే సాగుతున్నదని, ఇప్పటికే చాలా పురోగతి సాధించారని, అలాంటప్పుడు సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాల్సిన అవసరమే లేదని ఏజీ శ్రీరామ్ అన్నారు.

 

 

వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు సాధించిన పురోగతి, సంపాదించిన ఆధారాలు, ముంన్ముందు ఏం చెయ్యబోది సమగ్రంగా వివరిస్తూ ప్రభుత్వం ఒక రిపోర్టను తయారు చేసింది. సీల్డ్ కవర్ లో దాచిన ఆ రిపోర్టను సుబ్రమణ్య శ్రీరామ్‌.. హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావుకు అందజేశారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దంటున్నామో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నామని ఏజీ తెలిపారు. రిపోర్టును స్వీకరించిన హైకోర్టు.. కేసు విచారణను సోమవారానికి(ఈనెల 24కు) వాయిదా వేసింది.

 

 

 వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలనే అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగియడం, దర్యాప్తు రిపోర్టును ప్రభుత్వం అందజేసిన నేపథ్యంలో వచ్చేవాయిదా(సోమవారం)రోజే జడ్జి తీర్పు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి గురువారం నడుస్తోన్న విచారణను జడ్జి ముందుకు(సోమవారానికి) జరపడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: