2019 ఎన్నికల్లో జగన్ ఫ్యాన్ గాలిలో గుంటూరు జిల్లాలో టీడీపీ సైకిల్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కేవలం 2 మాత్రం గెలుచుకోగలిగింది. అయితే గెలిచిన ఇద్దరిలో ఒకరైన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవల వైసీపీకి జై కొట్టేశారు. దీంతో గుంటూరులో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. రేపల్లె నుంచి రెండోసారి గెలిచిన అనగాని సత్యప్రసాద్ ఒక్కడై పోరాడుతున్నాడు.

 

ఒక బిజినెస్‌మెన్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన అనగాని, టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో రేపల్లె నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన వెనుకడుగు వేయకుండా ఓ వైపు బిజినెస్ నడిపించుకుంటూనే, మరోవైపు  నియోజకవర్గంలో పని చేసుకున్నారు. అలా కష్టపడటం వల్లే 2014లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవిపై విజయం సాధించారు.

 

ఎలాగో టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టించారు. సాధ్యమైనంతవరకు నిధులు తెచ్చుకుని పనులు చేశారు. ఆ విధమైన అభివృద్ధి చేయడం వల్లే, 2019 లో రాష్ట్రమంతా జగన్ హవా ఉన్న, రేపల్లెలో మాత్రం అనగాని హవా నడిచింది. మళ్ళీ మోపిదేవిపై 11 వేల పైనే మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి టీడీపీ అధికారం కోల్పోవడంతో, ఆయనకు నియోజకవర్గంలో పెద్దగా నిధులు అందే అవకాశం లేదు. పైగా మోపిదేవి మంత్రి కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇదే అనగానికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.

 

కాకపోతే తనకు సాధ్యమైనంతవరకు అనగాని పని చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అవకాశం బట్టి సొంత డబ్బులని ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక అసెంబ్లీలో కూడా అనగాని బాగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో సబ్జెక్ట్ బట్టి మాట్లాడుతూ, వైసీపీని ఇబ్బంది కూడా పెట్టారు. అటు బయట కూడా సమయాన్ని బట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రేపల్లె నియోజకవర్గం అమరావతి దగ్గరలో ఉండటం అనగానికి కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత ఉంది. మొత్తానికైతే అనగాని గుంటూరు టీడీపీలో ‘ఒకే ఒక్కడు’గా పోరాడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: